Share News

గాంకొండ వాసులకు రవాణా కష్టాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:05 PM

మండలంలో పి.మాకవరం పంచాయతీ గాంకొండ గ్రామస్థులకు రవాణా కష్టాలు ప్రారంభమయ్యాయి.

గాంకొండ వాసులకు రవాణా కష్టాలు
ప్రాణాలకు తెగించి కొండవాగు దాటుతున్న గాంకొండ మహిళలు

పి.మాకవరం-గాంకొండల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

వంతెన లేక వాగు దాటేందుకు సాహసాలు చేస్తున్న గిరిజనులు

కొయ్యూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

మండలంలో పి.మాకవరం పంచాయతీ గాంకొండ గ్రామస్థులకు రవాణా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మాకవరం-గాంకొండ గ్రామాల మధ్య గల కొండవాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఏ చిన్న అవసరానికైనా గ్రామస్థులు సాహసించి వాగు దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే వాగు దాటడం తప్పనిసరి. ప్రత్యామ్నాయ మార్గం లేదు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఈ వాగు పొంగింది. దీంతో గ్రామస్థులు నిత్యావసర సరుకులతోపాటు తదితర అవసరాల కోసం శనివారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మొలలోతు నీటిలో ప్రవాహాన్ని దాటి వెళ్లాల్సి వచ్చింది. వాగును దాటినప్పటికీ ఒడ్డుకు చేరుకోవాలంటే గట్టుకు ఆనుకుని ఉన్న బొడ్డ చెట్టుకు రెండు వెదురు బొంగులు అమర్చి, వాటిపై ఎక్కి వాగును దాటుతున్నారు. ఇక ఆడవారి బాధలు వర్ణణాతీతం. ఈ వాగుపై వంతెన నిర్మించాలని ఎప్పటి నుంచో గాంకొండ వాసులు కోరుతున్నప్పటికీ పట్టించుకునే నాఽథులే లేరు. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం వచ్చే నాయకులు ఇచ్చే హామీలు వాగులో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఈ వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టి రవాణా కష్టాలు తీర్చాలని గాంకొండ వాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:05 PM