Share News

రవాణా సేవలు సరళీకృతం

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:32 AM

రవాణా శాఖ సేవలను ప్రభుత్వం సరళీకృతం చేస్తున్నది. డ్రైవింగ్‌ ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌) సేవలను ప్రభుత్వం రవాణా శాఖ పరిధి నుంచి తొలగించింది. ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.

రవాణా సేవలు సరళీకృతం
రర్రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం

- రవాణా శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ సేవల తొలగింపు

- ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం

- కార్యాలయానికి వెళ్లే పని లేకుండా అన్ని సేవలు అందుబాటులోకి..

నర్సీపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖ సేవలను ప్రభుత్వం సరళీకృతం చేస్తున్నది. డ్రైవింగ్‌ ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌) సేవలను ప్రభుత్వం రవాణా శాఖ పరిధి నుంచి తొలగించింది. ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.

గత నెల 28న ట్రాన్స్‌పోర్టు వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ సేవలను తొలగించింది. ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా వాహనదారుడు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో సొంతంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకొని రూ.410లు చలానా చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో సమర్పిస్తే లింక్‌ వస్తుంది. దాన్ని ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేస్తే ఎల్‌ఎల్‌ఆర్‌ మంజూరు అవుతుంది. అయితే విధి విధానాలు ప్రకటించకూడా రవాణాశాఖ పరిధి నుంచి వెబ్‌సైట్‌ తొలగించడంతో ఐదారు రోజులుగా ఎల్‌ఎల్‌ఆర్‌ దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ఎల్‌ఎల్‌ఆర్‌ లింక్‌ ఓపెన్‌ కావడం లేదని అంటున్నారు.

ఏటీఎస్‌లో ఫిట్‌నెస్‌

రవాణా శాఖ పరిధి నుంచి ఆటోలు, ఇతర పెద్ద వాహనాల ఫిట్‌నెస్‌ సేవలను తొలగించి గత ఏడాది ప్రైవేటుకు ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏటీఎస్‌ (ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌)ను సబ్బవరంలో ఏర్పాటు చేశారు. ఫిట్‌నెస్‌ గడువులోపు అక్కడికి వాహనాన్ని తీసుకు వెళితే ఆధునిక యంత్ర పరికరాలతో తనిఖీ చేసి ఫిట్‌నెస్‌ మంజూరు చేస్తున్నారు. గతంలో రవాణా శాఖ కార్యాలయానికి వెళితే సంబంధిత అధికారి తనిఖీ చేసి మేన్యువల్‌ పద్ధతిలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అయితే నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు, ఏఎస్‌ఆర్‌ జిల్లా వాసులకు ఏటీఎస్‌ 100 నుంచి 120 కిలోమీటర్లు దూరం కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో ఏటీఎస్‌ను నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే వాహనదారులకు వెసులుబాటు ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ సేవలను రవాణా శాఖ పరిధి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. వాహనం కొనుగోలు చేసేటప్పుడే షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. అయితే డీలర్లు బైక్‌ షోరూమ్‌లలో ఎక్చేంజ్‌ ఆఫర్‌లో పాత బైక్‌కి ధర కట్టి, కొత్త బైక్‌ విక్రయిస్తున్నారు. తరువాత పాత బైక్‌ వేరే వ్యక్తులకు రేటు కట్టి అమ్మేస్తున్నారు. ఆ తరువాత ట్రాన్స్‌ఫర్‌ చేయకపోవడంతో పాత యజమాని పేరుమీద బైక్‌ ఉండిపోతుంది. పాత బైక్‌ కొనుగోలు చేసిన వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్‌ చేస్తే, ఎక్చేంజ్‌లో బైక్‌ ఇచ్చిన యజమాని కేసుల్లో ఇరుక్కుంటున్నాడు.

త్వరలో డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లు

త్వరలో డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి రెండు ఎకరాలు భూమి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సీపట్నం, అనకాపల్లి, విజయనగరానికి చెందిన ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లు కూడా ప్రైవేటుకు ఇస్తే లైసెన్స్‌లకు కూడా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే పని లేదు. ఇప్పటికే పొల్యూషన్‌, వాహనాల బదిలీలు, ఎన్‌వోసీలు కూడా రవాణా శాఖ పరిధి నుంచి తీసేశారు. దీనిపై ఆర్టీవో రమేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రభుత్వం రవాణాశాఖ సేవలను సరీళీకృతం చేసే క్రమంలో ఎల్‌ఎల్‌ఆర్‌ సేవలు ఆన్‌లైన్‌ చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి తొలగించారని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు వస్తాయని తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 12:32 AM