Share News

పారదర్శకంగా ‘సర్‌’

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:59 AM

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌)ను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు.

పారదర్శకంగా ‘సర్‌’

ఎటువంటి లోపాలు లేకుండా చూడండి

అధికారులకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశాలు

తప్పు చేసినట్టు తేలితే ఉద్యోగం కోల్పోవడంతో పాటు జైలు శిక్ష

విశాఖపట్నం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌)ను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. ‘సర్‌’పై గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాల సవరణలో ఎటువంటి లోపాలు, అవకతవకలు లేకుండా చూడాలని, అన్ని రాజకీయ పార్టీలను సమానంగా పరిగణించి చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టంచేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడినా, అనధికారికంగా ఓట్లను తొలగించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేసినట్టు తేలితే ఉద్యోగం కోల్పోవడమే కాకుండా జైలు శిక్ష ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. తొలగించే ప్రతి ఓటుకు ప్రత్యేక ఫైలు నిర్వహించి సరైన కారణాలు నమోదుచేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ పక్కాగా పూర్తిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా చూడాలన్నారు. గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ కాకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. బీఎల్‌వోలను కేవలం ఎన్యుమరేషన్‌కు మాత్రం వినియోగించాలని, ఇతర విధులను అప్పగించవద్దన్నారు. సమావేశంలో జేసీ జి.విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:59 AM