Share News

పారదర్శకంగా సర్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:35 AM

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి జిల్లా అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా సర్‌

పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు

షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తిచేయాలి

ఓటరు జాబితాల తయారీలో అన్యులను తలదూర్చనివ్వొద్దు

అధికారులకు భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి జోషి దిశానిర్దేశం

అనకాపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి):

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ‘ఎస్‌ఐఆర్‌’ అమలు తీరుపై సోమవారం కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి డీఈఓ, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, ఓటర్ల నుంచి పూర్తిచేసిన ఫారాల స్వీకరణ, వాటిని డిజిటలైజేషన్‌ చేయడం, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటరు జాబితాల ప్రచురణ తదితర పనులను షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణలో ఇతరుల సహాయం తీసుకున్నప్పటికీ ఓటర్ల వివరాలు, తుది నమోదు ప్రక్రియను బీఎల్‌ఓలు స్వయంగా చేయాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అనధికారిక వ్యక్తులు ఓటర్ల నమోదు, పరిశీలన వంటి ప్రధానం విధుల్లో జోక్యం చేసుకోకూడదని, అన్ని పనులను బీఎల్‌ఓలే స్వయంగా చేయాలన్నారు.

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ‘ఎస్‌ఐఆర్‌’ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మండలస్థాయి కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు, సూపర్‌వైజర్ల ద్వారా నిరంతర నిఘా, రోజువారీ లక్ష్యాలు, వెనుకబడిన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్టు వివరించారు.

జిల్లాలో 11,64,089 మంది మ్యాపింగ్‌ పూర్తి...

ఇన్‌చార్జి డీఆర్‌ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,02,389 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 11,64,089 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,529 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా 107 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు, ఆరు కేంద్రాలను మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. సమావేశానికి జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు హాజరయ్యారు.

Updated Date - Jul 07 , 2026 | 01:35 AM