Share News

పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:07 PM

జిల్లాలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. సర్‌ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.

పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, డీఆర్‌వో లోకేశ్వరరావు

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

సర్‌ ప్రక్రియపై అధికారులతో ప్రత్యేక సమావేశం

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

పాడేరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. సర్‌ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, నిబంధనల మేరకు పారదర్శకంగా ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను నిర్వహించాలన్నారు. జిల్లాలో నమోదు ఫారాల పంపిణీ తక్కువ స్థాయిలో జరిగిందని, వేగం పెంచాలన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్‌ ఫారాలు అందజేయడంతోపాటు దానిపై ఓటర్లకు అవగాహన కల్పించి, వాటిని పూరించేందుకు సిబ్బంది సహకరించాలన్నారు. అలాగే పూర్తి చేసిన ఫారాలను సకాలంలో డిజిటలైజేషన్‌ చేయాలని, ఈ క్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. ఓటరు మ్యాపింగ్‌లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని, 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు జాబితా ఆధారంగా సర్‌ ప్రక్రియను పక్కాగా చేపట్టి అర్హులైన వారిని జాబితాల్లో చేర్పించాలన్నారు. అలాగే మృతులు, రెండు చోట్ల ఓట్లున్న వ్యక్తులు, గుర్తింపు వివరాలు అందుబాటులోని వారి పేర్లను నిబంధనల మేరకు మాత్రమే ఓటరు జాబితాల నుంచి తొలగించాలని, ఈ క్రమంలో బూత్‌ స్థాయి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సర్‌ ప్రక్రియ భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతున్నదని, దీనిలో రాజకీయ జోక్యం, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంలో సర్‌ ప్రక్రియను పక్కాగా చేపట్టి అర్హులైన ఓటర్లకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో భుజంగరావు, జిల్లాలోని 11 మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, బూత్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:07 PM