Share News

రెండో దశ పోరుకు ముగిసిన ప్రచారం

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:21 AM

జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలమంచిలి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లోని 213 పంచాయతీల్లో ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది.

రెండో దశ పోరుకు ముగిసిన ప్రచారం
పోలింగ్‌ సామగ్రి పంపిణీ కోసం నక్కపల్లిలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఎలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పంచాయతీల్లో పోలింగ్‌ రేపు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నేడు మండల కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రి పంపిణీ

ప్రలోభాలకు తెరతీసిన అభ్యర్థులు, రాజకీయ నేతలు

నగదు, మద్యం, పలు రకాల గృహోపకరణాలు పంపిణీ

అనకాపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలమంచిలి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లోని 213 పంచాయతీల్లో ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏకగ్రీవం అయిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు పదవులు మినహా మిగిలిన పదవులకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది శనివారం ఉదయం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు వెళ్లి, ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకొని పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. భోజన విరామం తరువాత సుమారు రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలను ప్రకటిస్తారు. విజేతలకు ధ్రువీకరణపత్రాలను అందజేస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. కాగా ఎన్నికలు జరిగే మండలాల పరిధిలోని మద్యం దుకాణాలను శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

ప్రలోభాలు, పంపకాలు షురూ...

రెండో దశలో పోలింగ్‌ జరిగే గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు, ప్రధాన పార్టీల నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. సమావేశాలు, ర్యాలీలు, వాహన ప్రచారాలతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించింది. బహిరంగ ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు పరోక్ష ప్రచారానికి తెర తీశారు. ఓటర్లను ఆకర్షించేందుకు, ఎలాగైనా గెలుపును సొంతం చేసుకునేందుకు పురుషులకు నగదు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మహిళలకు నగదు లేదా పలురకాల గృహోపకరణాలను అందజేస్తున్నారు.

28 పంచాయతీలు ఏకగ్రీవం

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో రెండో విడతలో 213 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు 2,072 వార్డులకు ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 28 పంచాయతీలు ఏకగ్రీవం (సర్పంచ్‌, వార్డు పదవులన్నీ..) అయ్యాయి. మరో ఐదు పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతోపాటు కొన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 179 సర్పంచ్‌ పదవులకు 390 మంది పోటీలో మిగిలారు. రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవితోపాటు రెండు వార్డులను ఎస్సీలకు రిజర్వు చేశారు. కానీ ఈ పంచాయతీలో ఎస్సీ ఓటర్లు లేకపోవడంతో సర్పంచ్‌ పదవికి, ఆ రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీటికి ఎన్నికలు జరగడంలేదు. ఇక 2,072 వార్డులకుగాను 501 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,569 వార్డులకు 3,363 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 01:21 AM