12న ఉక్కు కార్మికుల సమ్మె
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:13 AM
వచ్చే నెల 12న సమ్మె చేపట్టనున్నామని ఉక్కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్
ఉక్కుటౌన్‌షిప్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల 12న సమ్మె చేపట్టనున్నామని ఉక్కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్లాంటులో పనిచేస్తున్న నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ నెల 13న స్టీల్‌ప్లాంటు సీఐటీయూ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవాటితో పాటు ఇటీవల యాజమాన్యం సృష్టించిన సమస్యలను పరిష్కరించాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తోంది. మరోసారి సమావేశమై యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని, బహిరంగ సభలు నిర్వహించి సమ్మె ఆవశ్యకతపై కార్మికవర్గాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవి...
- ఉత్పత్తి ఆధారిత వేతనాలపై యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
- పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలి
- నిలుపుదల చేసిన హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరించాలి
- టౌన్‌షిప్ క్వార్టర్స్‌లో నివాసితులకు విద్యుత్ చార్జీలు తగ్గించాలి
- ఈఎల్ పునరుద్ధరించాలి
- అధికారులకు ఇచ్చినట్టుగానే కార్మికులకు 15 సీఎల్స్ ఇవ్వాలి
- ఉక్కు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి
- సెయిల్ మాదిరిగా గ్రాట్యుటీ రూ.25 లక్షలకు పెంచాలి
- పని ప్రదేశంలో భద్రత కల్పించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
- 24 గంటలు క్యాంటీన్లు అందుబాటులో ఉంచాలి
- స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలి
- ఈవోఐ టెండర్లను రద్దు చేయాలి
- తొలగించిన కాంట్రాక్టు కార్మికులకును బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి
- ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి