చందనోత్సవ టికెట్ల విక్రయాల్లో పారదర్శకత
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:12 AM
సింహగిరిపై ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించే అప్పన్న చందనోత్సవంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్షించారు.
అధికారులకు ఇన్‌చార్జి మంత్రి ఆదేశాలు
ఈ ఏడాది ఏప్రిల్ 30న అప్పన్న నిజరూప దర్శనం
గత తప్పిదాలు పునరావృతం కాకూడదు
భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించేలా చూడాలి
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
సింహగిరిపై ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించే అప్పన్న చందనోత్సవంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరగాలని స్పష్టంచేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వీవీఐపీలకు నిర్దేశించిన సమయంలో అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. చందనోత్సవం ముందురోజు అంటే ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తారు కాబట్టి ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. టికెట్ల జారీ, విక్రయాల్లో పారదర్శకత ఉండాలని, నిర్ణీత సమయంలోగా ప్రక్రియ పూర్తిచేయాలని, అర్ధరాత్రి వరకూ విక్రయాలు జరగకుండా చూడాలని స్పష్టంచేశారు. టికెట్లపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలని, దర్శనాల సమయంలో వాటిని స్కాన్ చేశాకే పంపించాలని సూచించారు. కొండపై రద్దీ ఏర్పడకుండా ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని, పరిమితంగానే వాటికి పాస్‌లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జేసీ విద్యాధరి, డీసీపీలు మణికంఠ, లతామాధురి, దేవస్థానం ఈఓ సుజాత, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సత్తిబాబు, విశాఖ ఆర్‌డీఓ సుధాసాగర్, భీమిలి ఆర్‌డీఓ సంగీత్ మాధుర్ తదితర, అధికారులు పాల్గొన్నారు.