Share News

సబ్‌ రిజిస్ట్రార్లకు స్థానచలనం?

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:02 AM

రిజిస్ట్రేషన్ల శాఖలో కొన్నేళ్లుగా గుట్టుగా నడిచిపోతున్న వ్యవహారాలకు ఆర్థిక శాఖ చెక్‌ చెప్పింది.

సబ్‌ రిజిస్ట్రార్లకు స్థానచలనం?

గ్రేడ్‌-1 పోస్టుల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ర్టార్లు

ఉండకూడదనే నిబంధన అమలు

అధిక వేతనాలకు అంగీకరించబోమన్న ఆర్థిక శాఖ

జిల్లాల వారీగా వివరాల సేకరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్ల శాఖలో కొన్నేళ్లుగా గుట్టుగా నడిచిపోతున్న వ్యవహారాలకు ఆర్థిక శాఖ చెక్‌ చెప్పింది. గ్రేడ్‌-1 పోస్టుల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్లు పనిచేస్తూ అధిక వేతనాలు తీసుకుంటున్నారని ఆ శాఖ ఇటీవల గుర్తించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఇకపై అలా అధిక జీతాలు మంజూరు చేయబోమని స్పష్టంచేసింది. ఉద్యోగి క్యాడర్‌ ఏదైతే ఆ జీతమే ఇస్తాం తప్ప, అవసరాల కోసం, సర్దుబాట్ల పేరుతో పెద్ద పోస్టుల్లో చిన్న ఉద్యోగులను నియమించుకొని, ఆ స్థాయి జీతాలు డ్రా చేసుకోవాలంటే కుదరదని తేల్చి చెప్పింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ గతుక్కుమంది.

కొన్నిచోట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ లేకపోతే, అక్కడి అవసరాల మేరకు సీనియర్‌ అసిస్టెంట్లను పెట్టి ఆయా కార్యాలయాలను నడుపుతున్నారు. గ్రేడ్‌-1 పోస్టుల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్లను సర్దుబాటు పేరుతో డిప్యూటేషన్‌పై నియమించి పని చేయించుకుంటున్నారు. కొన్నిసార్లు బదిలీలు కూడా చేస్తున్నారు. ఆర్థిక శాఖ గతంలో ఎప్పుడూ దీనిపై అభ్యంతరాలు పెట్టలేదు. ఇప్పుడు ప్రతి ఉద్యోగి పే స్లిప్‌, వారి క్యాడర్‌, డ్రా చేస్తున్న జీతం...అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ లోపాలు బయటపడ్డాయి. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఆర్థిక శాఖ తెలియజేసింది. జిల్లాల వారీగా ఇలా ఎంతమంది పనిచేస్తున్నారో చూసుకొని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి?, వాటిలో ఎవరు పనిచేస్తున్నారు?, వారి క్యాడర్‌ ఏమిటి?...అనే వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-1 పోస్టులో ఉన్నట్టయితే అక్కడి నుంచి వేరే దగ్గరికి మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సబ్‌ రిజిస్ట్రార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది.

విశాఖ జిల్లా వరకు తీసుకుంటే సూపర్‌ బజార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-1 గ్రేడ్‌-2 రెండు పోస్టులూ ఉన్నాయి. మధురవాడ, ద్వారకానగర్‌, గోపాలపట్నం, గాజువాక కార్యాలయాలు గ్రేడ్‌-1 సబ్‌ రిజిస్ట్రార్లతో నడపాలి. గాజువాక, గోపాలపట్నాల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. ఆనందపురం, భీమునిపట్నం, పెదగంట్యాడ, పెందుర్తి గ్రేడ్‌-2 కార్యాలయాలు. అక్కడ ఆ కేడర్‌ వారే విధులు నిర్వహిస్తున్నారు. ఈ వివరాలన్నీ విజయవాడ పంపించాక, అక్కడి నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jun 04 , 2026 | 01:02 AM