రైళ్లు, బస్సులు కిటకిట
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:17 AM
రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఉద్యోగం, ఉపాధి, కూలిపనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా సొంతూళ్లకు వస్తుంటారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీ
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం అధిక సమయం నిరీక్షణ
అనకాపల్లి టౌన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఉద్యోగం, ఉపాధి, కూలిపనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా సొంతూళ్లకు వస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు. కొత్తగా పెళ్లయి అమ్మాయిలు పుట్టింటికి రావడం ఆనవాయితీ. ఇంకా ఉన్నత విద్యను దూరం ప్రాంతాల్లో అభ్యసిస్తున్న వారు సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వస్తుంటారు. మరో మూడు, నాలుగు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండడంతో వీరంతా సొంతూళ్ల బాట పట్టడంతో ఆదివారం రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సు కిటకిటలాడాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తదితర ప్రాంతాలకు వలసపోయిన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వేలాది మంది రైళ్ల ద్వారా అనకాపల్లి చేరుకొని, ఇక్కడి నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో తమ గ్రామాలకు వెళుతున్నారు. రైళ్లలో వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆర్టీసీ కాంపెక్సుకు రావడంతో ఇక్కడ రద్దీ వాతావరణం నెలకొంది. దీనికితోడు స్ర్తీ శక్తి పథకం అమలు తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. ఫలితంగా ఆర్టీసీ బస్సులకు తాకిడి పెరిగింది. చిన్నపిల్లలు, లగేజీతో ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి కొన్నిసార్లు కుస్తీలు పట్టాల్సి వస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీనిబట్టి అదనపు సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.