తీరంలో విషాదం
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:47 AM
వారంతా స్నేహితులు. ఫ్రెండిష్‌డే సెలబ్రేషన్స్ కోసం బీచ్‌కు వెళ్లారు. సరదాగా గడిపి, తిరిగి వెళ్లేందుకు సిద్ధమై చివరిగా సముద్రం అందాల మధ్య వీడియో తీసుకునేందుకు ఆరుగురు రాళ్లగుట్టపైకి చేరారు.
వీడియో తీసుకునేందుకు రాళ్లపైకి వెళ్లిన యువత
అల తాకిడికి యువతీ, యువకుల గల్లంతు
రాళ్లలో చిక్కుకున్న మరో ఆరుగురు
స్నేహితుల దినోత్సవం రోజున గంగవరం బీచ్‌లో సంఘటన
గల్లంతైన వారికి కోసం విస్తృత గాలింపు
గాజువాక, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):
వారంతా స్నేహితులు. ఫ్రెండిష్‌డే సెలబ్రేషన్స్ కోసం బీచ్‌కు వెళ్లారు. సరదాగా గడిపి, తిరిగి వెళ్లేందుకు సిద్ధమై చివరిగా సముద్రం అందాల మధ్య వీడియో తీసుకునేందుకు ఆరుగురు రాళ్లగుట్టపైకి చేరారు. మరొకరు వీడియో తీస్తున్నారు. ఇంతలో పెద్ద అల వారిని తాకింది. దీంతో చెల్లాచెదురయ్యారు. వారిలో ఓ యువతి, యువకుడు గల్లంతవగా, మిగిలిన నలుగురు రాళ్లమధ్య ఇరుక్కుపోయారు. ఈ విషాద సంఘటన గంగవరం బీచ్‌లో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి...
మహారాణిపేట ప్రాంతానికి చెందిన సురకల నీతు (19), దోసూరి సురేష్, దోసూరి కనకమహాలక్ష్మి, దోసూరి హాసిని, పెద్దగాడ రాజు, సురకల మందిర, పెందుర్తి సమీపంలోని పురుషోత్తమపురం ప్రాంతానికి చెందిన గురజాల దామోదర్ అలియాస్ రాము (31) స్నేహితుల దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుందామని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 7.30 గంటలకు పాతగంగవరం బీచ్‌కు చేరుకున్నారు. సుమారు 10 గంటల వరకు బీచ్ పరిసరాల్లో సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, చివరిగా ఒక్క వీడియో తీసుకుని బయలుదేరాలని భావించి ఆరుగురు స్నేహితులు రాళ్ల గుట్టపైకి ఎక్కారు. మరో స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ అల తాకిడికి వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. స్నేహితుల్లో నీతు, రాములు అలతాకిడితో గల్లంతవగా, మిగిలిన నలుగురు రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. వీడియో తీస్తున్న సురేష్ వారిని బయటకు లాగి కాపాడాడు. కళ్ల ముందే ఇద్దరు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోవడంతో మిగిలిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ హెలికాప్టర్, డ్రోన్‌ల సహాయంతో ఆదివారం సాయంత్రం వరకు గాలించినప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన నీతు తండ్రి ప్రసాద్ కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఆమె నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. గల్లంతైన యువకుడు దామోదర్ ఆటోడ్రైవర్.
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
యువతీ యువకుల గల్లంతు సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు, బంధువులు భారీ సంఖ్యలో పాతగంగవరం బీచ్‌కు చేరుకున్నారు సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా ప్రమాదంలో చిక్కుకోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాగా ప్రమాదంలో గల్లంతైన గురజాల దామోదర్ అలియాస్ రాముకు అనాధ అయిన యువతితో ఏడేళ్ల కిందట వివాహమయింది. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే గత కొద్దికాలంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో రాము తన తల్లి లలిత వద్ద ఉంటున్నాడు. అతడి భార్య, కుమార్తె వేరుగా ఉంటున్నారు. రాము తల్లి వస్త్రదుకాణంలో పనిచేస్తుండగా అతడు ఆటో డ్రైవర్.