Share News

పండుగ పూట విషాదం

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:33 AM

మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

పండుగ పూట విషాదం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

పెదబొడ్డేపల్లిలో టిప్పర్‌ను ఢీకొన్న కారు

మృతులిద్దరూ నర్సీపట్నం వాసులు

తెల్లవారుజామున విశాఖ నుంచి వస్తుండగా ఘటన

నర్సీపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ రోజున రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధి అయ్యన్న కాలనీకి చెందిన మేరపురెడ్డి వెంకట దుర్గా ప్రసాద్‌ అలియాస్‌ పండు (21), పెదపాటి వంశీ (22) స్నేహితులు. వంశీ ఇంటర్‌ వరకు చదువుకొని వైజాగ్‌లో అల్యూమినియం కంప్‌బోర్డులు, కిటికీ ఫ్రేమ్స్‌ తయారు చేసే షాపులో పని చేస్తున్నాడు. దుర్గా ప్రసాద్‌ ఐటీఐ పూర్తి చేసి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ శనివారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం వెళ్లారు. రాత్రికి అక్కడే వుండి, ఆదివారం విశాఖలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత నర్సీపట్నం బయలుదేరారు. తెల్లవారుజామున పెదబొడ్డేపల్లి ఆర్‌సీఎం స్కూల్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను కారు బలంగా ఢీకొన్నది. ఈ సమయంలో పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో సమీపంలోకి వచ్చే వరకు టిప్పర్‌ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి వుంటుందని భావిస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్‌ చేస్తున్న దుర్గా ప్రసాద్‌, పక్క సీట్లో కూర్చున్న వంశీ అక్కడిక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పట్టణ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకొన్నారు. ఇద్దరు మృతదేహాలు కారులో ఇరుక్కుపోయి వుండడంతో ఎక్స్‌కవేటర్‌ను రప్పించారు. టిప్పర్‌ ముందు భాగంలో ఇరుక్కుపోయిన కారుని బయటకు తీయించారు. అనంతరంలో కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. వారి వద్ద వున్న ఆధారాల మేరకు అయ్యన్న కాలనీకి చెందిన మేరపురెడ్డి వెంకట దుర్గా ప్రసాద్‌, పెదపాటి వంశీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దుర్గాప్రసాద్‌ తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 10 , 2026 | 01:33 AM