Share News

చవితి పండుగ రోజున గోవాడలో విషాదం

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:10 AM

నాగుల చవితి పండుగ రోజున మండలంలోని గోవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు సంఘటనల్లో మృతిచెందడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. గోవాడకు సమీపంలోని శారదా నదిలో శుక్రవారం ఉదయం స్నానానికి నదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మృతిచెందారు. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

చవితి పండుగ రోజున  గోవాడలో విషాదం

శారదా నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యవసాయ కూలీల మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన యువతి దుర్మరణం

చోడవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నాగుల చవితి పండుగ రోజున మండలంలోని గోవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు సంఘటనల్లో మృతిచెందడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. గోవాడకు సమీపంలోని శారదా నదిలో శుక్రవారం ఉదయం స్నానానికి నదిలో దిగిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మృతిచెందారు. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

గోవాడకు చెందిన సేనాపతి అప్పారావు (55), ఏడువాక నూకరాజు (45) వ్యవసాయ కూలీలు. శుక్రవారం నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు చేసేందుకు ఉదయం 9.30 గంటల సమయంలో శారదా నదిలో స్నానానికి దిగారు. వీరికి సమీపంలో సేనాపతి స్వామి, మరికొంతమంది కూడా వున్నారు. తొలుత అప్పారావు నీటిలో దిగాడు. ఆ ప్రదేశంలో లోతు అధికంగా వుండడంతోపాటు స్పల్పంగా వరద ప్రవాహం వుండడంతో నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించడానికి నదిలో దూకిన నూకరాజు కూడా నీటిలో మునిగిపోయాడు. వీరిద్దరిని కాపాడేందుకు సమీపంలో వున్న సేనాపతి స్వామి అనే యువకుడు ప్రయత్నిస్తుండగా... అతను కూడా మునిగిపోతుండడంతో ఒడ్డున నిలబడిన నదిలో దూకి అతడిని రక్షించారు. అప్పారావు, నూకరాజు గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామ నాయకులు ఏడువాక సత్యారావు, లక్ష్మణకుమార్‌, అర్జునరావు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించి, అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. విగతజీవులుగా మారిన కుటుంబ పెద్ద దిక్కులను చూసి భార్య, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. సేనాపతి అప్పారావుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడువాక నూకరాజుకు భార్య వెంకట లక్ష్మి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పండుగ రోజు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో గోవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గోవాడ యువతి మృతి

సొంతూరులో నాగుల చవితి పండుగ చేసుకోవడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో చెల్లెలు మృతిచెందగా, అక్కకు గాయాలయ్యాయి. గోవాడ గ్రామానికి చెందిన షుగర్స్‌ కార్మిక సంఘం నాయకుడు కోరిబిల్లి భాస్కరరావు సోదరుడు వేణుగోపాలరావు (కిశోర్‌) విశాఖలోని నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ... భార్య, ఇద్దరు కుమార్తెలతో మధురవాడ ప్రాంతంలోని పీఎం పాలెంలో నివాసం వుంటున్నారు. శుక్రవారం నాగుల చవితి కావడంతో గోవాడలో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలో పాలుపోసేందుకు అక్క ఆదిత్య హర్షిణి, చెల్లెలు అమృత వర్షిణ (21) ఉదయం ఆరు గంటలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఎండాడ లా కళాశాల సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న అమృత వర్షిణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. దిత్య హర్షిణికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Nov 14 , 2026 | 01:10 AM