ఎన్టీఆర్ వైద్యాలయంలో విషాదం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:11 AM
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మూడు రోజుల మగశిశువు మృతిచెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బిడ్డ మృతికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మృతిచెందిన పసికందు తండ్రి వేగి శ్రీనివాసరావు చెప్పిన వివరాలిలా వున్నాయి.
మూడు రోజుల మగ శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన
చర్చలు జరిపిన సూపరింటెండెంట్
పోస్టుమార్టం రిపోర్టు మేరకు చర్యలు తీసుకుంటామని హామీ
శాంతించిన ఆందోళనకారులు
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మూడు రోజుల మగశిశువు మృతిచెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బిడ్డ మృతికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మృతిచెందిన పసికందు తండ్రి వేగి శ్రీనివాసరావు చెప్పిన వివరాలిలా వున్నాయి.
కశింకోట గవరపేట వీధికి చెందిన వేగి శ్రీనివాసరావు భార్య తులసీకి నెలలు నిండడంతో కాన్పు కోసం ఈ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్పించారు. గడువు దాటినప్పటికీ సాధారణ ప్రసవం కాకపోవడంతో అదే రోజు రాత్రి సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం శిశువు కాళ్ల రంగు మారడంతో శ్రీనివాసరావు ఓపీలో ఉన్న పిల్లల వైద్యుల వద్దకు తీసుకువెళ్లి చూపించారు. అక్కడ వున్న డాక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించి.. శిశువుకు ఏమీ కాలేదని, బాగానే వున్నాడని చెప్పి వార్డుకు పంపించేశారు. మధ్యాహ్నం శిశువుకు తల్లి పాలు పట్టింది. సాయంత్రం పసికందు శరీరం మొత్తం రంగు మారడంతోపాటు వెక్కిళ్లు రావడం మొదలైంది. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాసరావు.. వెంటనే మొదటి అంతస్థులో ఉన్న స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)కు తీసుకెళ్లారు. అక్కడ వున్న సిబ్బంది.. శిశువును ఇన్‌క్యూబేటర్‌లో పెట్టారు. కానీ అప్పుడు విద్యుత్ సరఫరా లేదు. వైద్యులెవరూ లేదు. కొద్దిసేపటి తరువాత అత్యవసర విభాగంలో ఉన్న వైద్యులు వచ్చి శిశువును పరిశీలించి, చనిపోయినట్టు చెప్పారు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లనే తన బిడ్డ చనిపోయాడని శ్రీనివాసరావు ఆరోపించారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి భార్యభర్తలు కన్నీరుమున్నీరయ్యారు. శిశువు మృతిచెందిన విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేపట్టారు. వైద్య విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వార్డులో శిశువుకు తల్లి పాలు పట్టినప్పుడు అవి కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో వెక్కిళ్లు వచ్చి ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో ఊపిరాడకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి శ్రీనివాసరావు, పసిబిడ్డను ఎస్‌ఎన్‌సీయూకు తీసుకువచ్చారని, విషయం తెలుసుకున్న అత్యవసర విభాగంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ గంగాధర్ వచ్చి వైద్యం చేయడానికి ప్రయత్నించగా, అప్పటికే శిశువు మృతి చెందినట్టు ఆయన గుర్తించారని వెల్లడించారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని, పాలు తాగిన క్రమంలో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఊపిరాడక మృతిచెందాడని ఆయన చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూలో పిల్లల వైద్య నిపుణులు ఇద్దరు వుండాలని, ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆయన తెలిపారు. కాగా ఎన్టీఆర్ వైద్యాలయంలో మూడు రోజుల శిశువు మృతిచెందినట్టు తెలుసుకున్న వైద్యాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు, డాక్టర్ డీడీ నాయుడు, గొర్లి శేఖర్ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. సూపరింటెండెంట్‌తో విడిగా సమావేశమయ్యారు. రాత్రి పది గంటల తరువాత ఆందోళనకారులతో ఆస్పత్రి సూపరింటెండెండ్ చర్చలు ప్రారంభించారు. శిశువు మృతికి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు పట్టుబట్టారు. అయితే శిశువుకు శనివారం ఉదయం పోస్టుమార్టం చేయించి, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతిచెందినట్టు నిర్ధారణ అయితే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై మీకు అనుమానం వుంటే మీరు (బాధితులు) సూచించిన వైద్యుడితోనే పోస్టుమార్టం చేయిస్తామని ఆయన చెప్పారు. శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పక్కకు వెళ్లి, కొద్దిసేపు చర్చించుకున్నారు. సూపరింటెండెంట్ రవికుమార్ ఇచ్చిన హామీని అంగీకరించి వెళ్లిపోయారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే భద్రపరిచారు.