Share News

ట్రాఫిక్‌ ఇక్కట్లు పట్టవు... తొలగింపులు నచ్చవు

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:10 AM

నగరంలో ఏ ప్రధాన మార్గంలో వెళ్లినా ట్రాఫిక్‌ చిక్కులే. జాతీయ రహదారిపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.

ట్రాఫిక్‌ ఇక్కట్లు పట్టవు... తొలగింపులు నచ్చవు

ఇదీ నగరంలో కొంతమంది నేతల తీరు

ఆక్రమణదారులకు అండదండలు

వారి జోలికి వెళ్లొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు

విమర్శలు పాలవుతున్న నేతలు, అధికారులు

రోడ్డు మార్జిన్లు, ఫుట్‌పాత్‌లపై దుకాణాల ఏర్పాటుతో వాహన రాకపోకలకు ఇబ్బందులు

తరచూ ప్రమాదాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఏ ప్రధాన మార్గంలో వెళ్లినా ట్రాఫిక్‌ చిక్కులే. జాతీయ రహదారిపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. నాయకులకు ఇవేవీ పట్టడం లేదు. వాటికి పరిష్కారాలు చూపడం లేదు. అధికారులు ఆ దిశగా ముందడుగు వేసినా వారికి అడ్డం పడుతున్నారు. ఆక్రమణదారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ట్రాఫిక్‌ ఇక్కట్లు పెంచుతున్నారు.

భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభమైన తరువాత జాతీయ రహదారి మరింత రద్దీగా మారింది. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వాహన చోదకులతో పాటు పోలీసులూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇసుకతోట, హనుమంతవాక జంక్షన్లలో కనీసం ఐదు నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. వెంకోజీపాలెం దాటిన తరువాత చందన మోహన్‌రావు ఫంక్షన్‌ హాలు ఎదురుగా ఇటు వైపు కొండ వాలు ప్రాంతంతో పాటు రోడ్డు మార్జిన్‌ను పండ్ల వ్యాపారులు ఆక్రమించుకున్నారు. కొందరైతే పశువుల గడ్డిని అక్కడే మేటలుగా వేసి వ్యాపారం చేస్తున్నారు. పండ్లు కొనడానికి వాహనాలు జాతీయ రహదారిపైనే ఆపుతుండడంతో ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దాంతో వారం క్రితం అధికారులు అక్కడి పండ్ల దుకాణాలను తొలగించారు. వారు అక్కడే మళ్లీ వ్యాపారాలు నిర్వహిస్తామని ధర్నాలు చేస్తున్నారు. వారికి స్థానిక నాయకులు వెన్నుదన్నుగా నిలిచి అనుమతించాలని అధికారులపై ఒత్తిడి పెడుతున్నారు. వాస్తవానికి సింహాచలం అధికారులు కొండ వాలు ఆక్రమణపై స్పందించి వారిని అక్కడి నుంచి పంపించాల్సి ఉండగా వారు కూడా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ చదును చేసిన భూమిలో ఇళ్లు నిర్మించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ కొండ వాలు ప్రాంతాన్ని ప్రస్తుతం వ్యాన్ల పార్కింగ్‌ ఏరియాగా ఉపయోగిస్తున్నారు. ఈ అంశంపై కఠిన చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవు.

గ్రీన్‌బెల్ట్‌లో అధికార నిర్మాణాలు

మూడు నెలల క్రితం మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారి పక్కనున్న గ్రీన్‌బెల్ట్‌లో చెట్లు తొలగించి, పైన హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉన్నా ఖాతరు చేయకుండా జీవీఎంసీ నిధులతో పికిల్‌ బాల్‌ కోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మరికొంత గ్రీన్‌బెల్ట్‌లో చెట్లు నరికించేసి అక్కడ ఫుడ్‌ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. అదే గనుక జరిగితే అక్కడకు వాహనాలపై వచ్చేవారితో కొత్తగా ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తాయి. దీనిని నిరోధించాల్సిన అధికారులు కూడా ఒత్తిళ్లకు లొంగి పనులు కొనసాగిస్తున్నారు. వీటిని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది.

ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు

దక్షిణ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ వివాదం ఒకటి మూడు రోజులుగా నడుస్తోంది. అమ్మవారి ఆలయమే ఫుట్‌పాత్‌పై ఉంది. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ప్రతి వారం అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు మేకలు, కోళ్లు కోసుకొని, ఫుట్‌పాత్‌పై టెంట్లు వేసుకొని భోజనాలు చేస్తుంటారు. కొందరు స్థానికులు అక్కడ టెంట్లను రోజుకు రూ.2 వేలకు అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఇదిలావుండగా జ్ఞానాపురం వైపు రైల్వే స్టేషన్‌ను అధికారులు అభివృద్ధి చేయడంతో వారి స్థలం వెంబడి ప్రహరీ నిర్మించారు. దానికి ఇటు వైపు జీవీఎంసీ ఫుట్‌పాత్‌లు నిర్మించింది. వాటిపై కొందరు రేకుల షెడ్లు వేసి అద్దెకు ఇచ్చుకుంటున్నారు. వాటిని జీవీఎంసీ అధికారులు మూడు రోజుల క్రితం తొలగించారు. అందులో ఆలయ సిబ్బంది ఏర్పాటుచేసిన షెడ్‌ కూడా ఉంది. అది భక్తుల కేశఖండన కోసం వేశామని సిబ్బంది చెబుతున్నారు. అయితే ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు ఎలా తొలగిస్తారని అధికారులపై స్థానిక నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఉపాధి కోసం వలస వచ్చిన కొందరు రోడ్డు పక్కన ఖాళీ స్థలం కనిపిస్తే ఒకరి తరువాత మరొకరు దుకాణాలు పెట్టేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారిని మొదట్లోనే నిలువరించాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది పట్టనట్టు ఊరుకుంటున్నారు. దాంతో దుకాణాలన్నీ సంతలా మారిపోతున్నాయి. వాటికి స్థానిక నాయకులు అండగా నిలుస్తున్నారు. నగరం పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా, మార్గాలు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికాకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.

Updated Date - Sep 13 , 2026 | 01:10 AM