నగరంలో ట్రాఫిక్ సోల్జర్స్
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:11 AM
నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించే బాధ్యత ‘ట్రాఫిక్ సోల్జర్స్’పై ఉందని సీపీ శంఖబ్రతబాగ్చి స్పష్టంచేశారు.
206 మంది నియామకం
ట్రాఫిక్ నియంత్రణలో వలంటీర్ల సేవలు వినియోగం
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాఫిక్‌ను నియంత్రించే బాధ్యత ‘ట్రాఫిక్ సోల్జర్స్’పై ఉందని సీపీ శంఖబ్రతబాగ్చి స్పష్టంచేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహన చోదకులకు అవగాహన కల్పించడం, రోడ్డుదాటే పాదచారులకు సహాయం చేయడం కోసం ‘ట్రాఫిక్ సోల్జర్స్’ పేరుతో వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీపీ నిర్ణయించారు. ఈ మేరకు ట్రాఫిక్ సోల్జర్స్‌గా నియమితులైన 206 మందికి వారు అందించాల్సిన సేవలతోపాటు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కమిషనరేట్‌లో బుధవారం దిశానిర్దేశం చేశారు. ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, మార్కెట్‌లు, ఆస్పత్రులు ఉన్న ప్రాంతాల్లో వాహనాలను క్రమబద్ధీకరించడం, మహిళలు, వృద్ధులు రోడ్డుదాటే సమయంలో సహాయం అందజేయడం, వాహనచోదకులు హెల్మెట్ ధరించేలా చూడడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయకుండా అవగాహన కల్పించడంతోపాటు పండుగలు, ర్యాలీలు, ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు సిబ్బందికి సహకరించడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్‌పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారి వివరాలను పోలీసులకు అందజేయడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందేలా చూడడం ట్రాఫిక్ సోల్జర్స్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్‌కుమార్, ఏసీపీ వాసుదేవ్, ట్రాఫిక్‌సీఐలు సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.22.47 కోట్లు రికవరీ
గడచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్లు
రాష్ట్రంలో ఇదే అత్యధికం
ఎప్పటికప్పుడు బాధితులకు అందజేత
సీపీ శంఖబ్రతబాగ్చి
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
సైబర్ కేసుల్లో బాధితులకు గడచిన మూడేళ్లలో రూ.22.47 కోట్లు రిఫండ్ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి 1,240 మందికి సంబంధించిన డబ్బును నిందితుల నుంచి రికవరీ చేశామన్నారు. ఆ మొత్తాన్ని బాధితులకు ఎప్పటికప్పుడు మేళా ద్వారా అందజేస్తున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ‘సైబర్‌క్రైమ్ బాధితుల రిఫండ్ మేళా’ పేరుతో రికవరీ చేసిన మొత్తాన్ని సీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల బారినపడిన వారికి 2023 వరకూ రూ.1.1 కోట్లు రిఫండ్ చేస్తే, 2024లో రూ.3.75 కోట్లు రికవరీ చేశామన్నారు. 2025లో ఏకంగా రూ.12.63 కోట్లు రిఫండ్ చేశామన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సైబర్ నేరాల కారణంగా డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రూ.ఐదు కోట్లు రిఫండ్ చేశామన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమన్నారు. మిగిలిన బాధితులకు సంబంధించిన డబ్బును రికవరీ చేసేందుకు బ్యాంకర్లతో సంప్రతింపులు జరుపుతున్నామన్నారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 558 మందిని అరెస్టు చేశామన్నారు. నగరంలో నమోదవుతున్న సైబర్ కేసులను పరిశీలిస్తే...77 శాతం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు సంబంధించినవన్నారు. మరో ఎనిమిది శాతం డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్, ఏడు శాతం ఎయిర్‌టెల్ ఫ్రాడ్స్, మూడు శాతం కేసులు ఈ-కామర్స్ ఫ్రాడ్స్, నాలుగు శాతం లైంగిక వేధింపులు, ఇతర ఫ్రాడ్స్ మరొక శాతం ఉంటున్నాయన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే బాధితులు మొదటి అర్ధగంటలోపే 1930కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యమైతే సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాల్లోని తమ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటారన్నారు. అప్పుడు రికవరీ అసాధ్యంగా మారుతుందన్నారు. ఈ సమావేశంలో డీసీపీ-1 మణికంఠ చందోలు, సైబర్ క్రైమ్ సీఐ భవానీప్రసాద్ పాల్గొన్నారు.