అచ్యుతాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:04 AM
పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం నుంచి అచ్యుతాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెజ్ ముఖద్వారం నుంచి వివిధ మార్గాల్లో భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. కేవలం బైకులు, తేలికపాటి వాహనాలు మాత్రమే అచ్యుతాపురం టౌన్ గుండా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
- పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా చర్యలు
- సెజ్ ముఖద్వారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు
అచ్యుతాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం నుంచి అచ్యుతాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెజ్ ముఖద్వారం నుంచి వివిధ మార్గాల్లో భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. కేవలం బైకులు, తేలికపాటి వాహనాలు మాత్రమే అచ్యుతాపురం టౌన్ గుండా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సెజ్ కర్మాగారాల నుంచి (పూడిమడక రోడ్డు) వచ్చే వాహనాలు అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ మీదుగా అచ్యుతాపురం- ఎలమంచిలి రోడ్డు గుండా వెళుతున్నాయి. రోజూ ఇతర వాహనాలతో పాటు సెజ్ కర్మాగారాల నుంచి వచ్చే బస్సులు కూడా ఇదే మార్గంలో వెళుతున్నాయి. అయితే ప్రతి శుక్రవారం వారపు సంత మండల కాంప్లెక్స్ ఆవరణలోనే జరుగుతుంది. అసలే ఇరుకు రోడ్డు, సంత కారణంగా వివిధ దుకాణాలు రోడ్డుకు ఇరువైపులా పెట్టేశారు. దీంతో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంలో పూడిమడక రోడ్డు గుండా అచ్యుతాపురం వైపు వెళ్లే వాహనాలను సెజ్ ముఖ ద్వారం వద్ద మళ్లించి మడుతూరు మీదుగా అచ్యుతాపురం-గాజువాక రోడ్డుకు వచ్చేలా పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. ఈ విషయం డ్రైవర్లకు తెలియకపోవడంతో వాహనాలన్నీ అచ్యుతాపురం జంక్షన్‌కు వచ్చేశాయి. దీంతో పోలీసులు డ్రైవర్ల నుంచి వాహనాల తాళాలు తీసేసుకున్నారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు అచ్యుతాపురం జంక్షన్‌కి చేరువలో నిలిచిపోయాయి. పోలీసులకు, ప్రయాణికులతో పాటు మోటారు సిబ్బందికి మధ్య భారీ స్థాయిలో వాగ్వాదం జరిగిన తరువాత వాహనాలను పోలీసులు వెనక్కి మళ్లించారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అచ్యుతాపురానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో గల సెజ్ ముఖద్వారం వద్ద భారీ వాహనాలు రాకుండా మట్టి కుప్పలు వేయించారు. గాజువాక, అనకాపల్లి వెళ్లే భారీ వాహనాలు సెజ్ ముఖద్వారం నుంచి మడుతూరు గ్రామం మీదుగా అచ్యుతాపురం-గాజువాక ప్రధాన రోడ్డులో గల మడుతూరు జంక్షన్‌కి వెళ్లేలా ట్రాఫిక్ మళ్లించారు. గాజువాక వైపు వెళ్లే వాహనాలు పరవాడ మీదుగా, అనకాపల్లి వెళ్లే వాహనాలు బంగారయ్యపాలెం, కొండకర్ల మీదుగా అచ్యుతాపురం-అనకాపల్లి ప్రధాన రోడ్డులో గల హరిపాలెం పాత సినిమాహాలు జంక్షన్ గుండా వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఎలమంచిలి వైపు వెళ్లే వాహనాలు సెజ్ పునరావాస కాలనీ మీదుగా ఎలమంచిలి-గాజువాక ప్రధాన రోడ్డుకి వెళ్లేలా ట్రాఫిక్ మళ్లించారు. శనివారం ఉదయం నుంచి పోలీసులు సూచించిన రోడ్లు గుండా వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి.