సీఎం చంద్రబాబు పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:42 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.
పినగాడి- దేవరాపల్లి రూట్‌లో సాధారణ వాహనాలకు ‘నో ఎంట్రీ’
కొత్తవలస మీదుగా మళ్లింపు
ఎస్పీ తుహిన్ సీన్హా వెల్లడి
కె.కోటపాడు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మండలంలోని ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం ఉదయం హెలికాప్టర్‌లో ఎ.కోడూరు చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి, ముఖ్యమంత్రి పర్యటన ముగిసే వరకు కె.కోటపాడు- ఆనందపురం జంక్షన్ మధ్య ఇతర వాహనాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పినగాడి నుంచి దేవరాపల్లి వెళ్లే భారీ వాహనాలు పెందుర్తి, కొత్తవలస, ఆనందపురం జంక్షన్ మీదుగా వెళ్లాలన్నారు. దేవరాపల్లి నుంచి కె.కోటపాడు మీదుగా పెందుర్తి, విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఆనందపురం జంక్షన్, కొత్తవలస మీదుగా ప్రయాణించాలని పేర్కొన్నారు. దేవరాపల్లి నుంచి అనకాపల్లి, చోడవరం వెళ్లే వాహనాలు లంకవానిపాలెం, పిండ్రంగి, దాలివలస, రామచంద్రాపురం, కె.కోటపాడు మీదుగా వెళ్లాలన్నారు. వెంకన్నపాలెం నుంచి దేవరాపల్లి వెళ్లే వాహనాలు చౌడువాడ నుంచి పాచిలవానిపాలెం మీదుగా వెళ్లవలసి ఉంటుందని ఆయన చెప్పారు.
సీఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, సాధారణ ప్రజానీకం వచ్చే వాహనాల నిలుపుదలకు విడివిడిగా పార్కింగ్ స్థలాలు కేటాయించామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. వి.మాడుగుల, చౌడువాడ, గొండుపాలెం, రొంగలినాయుడు, పైడంపేట, పాచిలవానిపాలెం, సూదివలస, చంద్రయ్యపేట, కె.సంతపాలెం, కె.కోటపాడు, గొట్లం, పాతవలస గ్రామాల నుంచి వచ్చే వారు కె.కోటపాడు రావాలమ్మ తల్లి గుడి, మేడిచర్ల మీదుగా వచ్చి సూరెడ్డిపాలెం వద్ద ఉన్న లేఅవుట్‌లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు. చీడికాడ, దేవరాపల్లి మండలాల నుంచి వచ్చే వారు తురువోలు, అలమండ/ ఆనందపురం మార్గాల్లో వచ్చి ఏ.కోడూరులోని రంగరాయ చెరువు వద్ద కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. లంకవానిపాలెం, కొరువాడ, ఆనందపురం, వి.సంతపాలెం, డి.అగ్రహారం, వారాడ గ్రామాల నుంచి వచ్చే వాహనాలు ఏ.కోడూరులోని గంగరాజు చెరువు వద్ద; దాలివలస, సింగన్నదొరపాలెం నుంచి వచ్చే వాహనాలు సూరెడ్డిపాలెంలో సామిల్లు వద్ద వాహనాలు నిలుపుకోవాలని ఎస్పీ సూచించారు. మర్రివలస, శృంగవరం, పిండ్రంగి, గవరపాలెం, కె.జె.పురం, కొత్త అగ్రహారం గ్రామాల నుంచి వచ్చే వారు ఏ.కోడూరు గాయత్రి స్కూల్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. కె.కోటపాడు జంక్షన్ నుంచి వారాడ గ్రామం వరకు వాహనాల రాకపోకలను నిషేధించినటుట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా చెప్పారు.