గౌరీపట్నం రూట్లో ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:54 AM
బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై కాజ్‌వే పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయరామరాజుపేట కాజ్‌వే పునరుద్ధరణలో తీవ్రజాప్యం
చోడవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై కాజ్‌వే పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల చివరి వారంలో సంభవించిన ఆర్నబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో తాచేరు గెడ్డ పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో చోడవరం- వడ్డాది మధ్య విజయరామరాజుపేట వద్ద తాత్కాలిక కాజ్‌వే కొట్టుకుపోయింది. కనీసం నడిచి వెళ్లడానికి కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చోడవరం వైపు నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు వెళ్లే వాహనాలను గౌరీపట్నం మార్గంలోకి మళ్లించారు. ఈ రహదారి చిన్నది కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభిస్తున్నది. వాస్తవంగా తాచేరు గెడ్డలో వరద ఉధృతి వారం రోజుల్లోనే తగ్గిందని, కానీ కాజ్‌వే పునరుద్ధరణ పనులు చేపట్టడానికి వీలుకాదంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు చేతులెత్తేశారు. ఎట్టకేటకు బుధవారం కాజ్‌వే వద్ద చిందరవందరగా వున్న సిమెంటు తూములను వరుసక్రమంలో పేర్చారు. గురువారం గ్రావెల్, రాళ్లు వేసి రోలింగ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి పనులు పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.