ట్రాఫిక్ విధులు గాలికొదిలి...
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:22 AM
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ సమయాల్లో కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించకుండా హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారికి చలాన్‌ల జారీ, పెండింగ్ ఈ-చలాన్‌ల తనిఖీ పనిలో నిమగ్నమవుతున్నారు. కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతున్నా పట్టించుకోవడం లేదు.
ఈ-చలాన్‌ల జారీ, పెండింగ్ చలాన్‌లు
కట్టించడంపైనే ట్రాఫిక్ పోలీసుల దృష్టి
వాహనాల క్రమబద్ధీకరణ బాధ్యతను విస్మరిస్తున్న సిబ్బంది
పోలీసులు లేకపోవడంతో సిగ్నల్ జంపింగ్‌లు
తరచూ ప్రమాదాలు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ సమయాల్లో కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించకుండా హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారికి చలాన్‌ల జారీ, పెండింగ్ ఈ-చలాన్‌ల తనిఖీ పనిలో నిమగ్నమవుతున్నారు. కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతున్నా పట్టించుకోవడం లేదు.
వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం, అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఉన్న రోడ్లకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటుచేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు కొందరు వాహనచోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకు పోతుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు క్రమపద్ధతిలో సాగేలా పర్యవేక్షించేందుకు ఒక హెడ్‌కానిస్టేబుల్/ఒక కానిస్టేబుల్/హోంగార్డును నియమిస్తున్నారు. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షించాలి. అయితే నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రధాన విధులను పక్కనపెట్టేసి ఇతర పనుల్లో ఉంటున్నారు. తమకు డ్యూటీ వేసిన జంక్షన్లను వదిలేసి నలుగురైదుగురు ఒకచోట చేరుతున్నారు. అక్కడ గుంపుగా నిలబడి ఆ మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపుతున్నారు. పెండింగ్ ఈ-చలాన్‌లు ఏమైనా ఉన్నాయా?...అనేది తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ ఉన్నట్టయితే వాట్సాప్, ఫోన్‌పే ద్వారా వాటిని చెల్లించాలని ఆదేశిస్తున్నారు. అలాగే హెల్మెట్ లేనివారిని ఆపి వాహనం ఫొటో తీసి ఈ-చలాన్‌లు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమైన ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పూర్తిగా విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మారని తీరు
కూడళ్లలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే విధులను పక్కనపెట్టే ట్రాఫిక్ పోలీసులు వేరొకచోట చలాన్‌ల తనిఖీలో నిమగ్నమవుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. కూడలిలో ట్రాఫిక్ పోలీస్ ఉంటే వాహన చోదకులు కూడా భయంతో సిగ్నల్స్‌ను ఫాలో అవుతుంటారు. పోలీస్ కనిపించకపోతే మాత్రం సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతుంటారు. స్వర్ణభారతి స్టేడియం, స్పెన్సర్స్ జంక్షన్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందితోపాటు సిరిపురం, టైకూన్ జంక్షన్లలో డ్యూటీలో ఉండాల్సిన వారంతా తరచూ రేసపువానిపాలెం రోడ్డుపైకి (ఆడి షోరూమ్ ఎదురుగా) చేరుతున్నారు. అక్కడ వాహనాలను ఆపి ఈ-చలాన్‌లను తనిఖీ చేస్తున్నారు. అక్కడకు సమీపంలో ఉన్న కూడళ్లలో ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సిరిపురం కూడలి, అప్పుఘర్ జంక్షన్, బీచ్‌రోడ్డు, అక్కయ్యపాలెం జంక్షన్‌లో కూడా నిత్యం ఇదే పరిస్థితి ఉంటుందని వాహన చోదకులు వాపోతున్నారు.