Share News

స్తంభించిన ట్రాఫిక్‌

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:57 AM

సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో నగర పోలీసులు విఫలమయ్యారు.

స్తంభించిన ట్రాఫిక్‌

సాయంత్రం ఆరు గంటల నుంచి నగరంలో కష్టాలు

జాతీయ రహదారి మీదుగా భక్తుల నడక

మద్దిలపాలెం జంక్షన్‌ , హనుమంతవాక వద్ద రోడ్లు మూసేసిన పోలీసులు

గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు

పోలీసులతో ఎక్కడికక్కడ వాగ్వాదం

క్రమబద్ధీకరణలో విఫలమయ్యారంటూ ఆగ్రహం

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో నగర పోలీసులు విఫలమయ్యారు. సాయంత్రం ఆరు గంటల వరకు సజావుగానే సాగిన వాహనాల రాకపోకలు ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి హనుమంతవాక వైపు, హనుమంతవాక జంక్షన్‌ నుంచి నగరంలోకి వాహనాలను అనుమతించకుండా రోడ్లు పూర్తిగా మూసేశారు. దీంతో మద్దిలపాలెం నుంచి ఇటు గురుద్వార జంక్షన్‌ వైపు, అటు ఆర్టీస్‌ కాంప్లెక్స్‌ రోడ్డులో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అలాగే హనుమంతవాక జంక్షన్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ వాహనాలను అనుమతించాలంటూ పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగారు. తమ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించేస్తే తాము ఇంట్లోనే ఉండేవాళ్లమని, అలాగైతే ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకపోయేది కదా? అంటూ పోలీస్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ భక్తుల భద్రత దృష్ట్యా వాహనాలను ముందుకు వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు.

మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభం కావడంతో నగర పోలీసులు ఆచితూచి వాహనాల రాకపోకలను మద్దిలపాలెం జంక్షన్‌ వద్ద అనుమతించారు. విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి వేపగుంట, పెందుర్తి మీదుగా జాతీయ రహదారిపైకి మళ్లించిన పోలీసులు మిగిలిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ సర్వీసులతోపాటు కార్లు, బైక్‌లు, ఆటోలను సాయంత్రం ఆరు గంటల వరకు హనుమంతవాక వైపు అనుమతించారు. అయితే సాయంత్రం ఆరు గంటలు తర్వాత భక్తుల తాకిడి పెరగడం, బీచ్‌లో స్నానాలు చేసిన తర్వాత భక్తులు వెంకోజీపాలెం వద్ద జాతీయ రహదారిని దాటి హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార మీదుగా వెళ్లకుండా ఎంవీపీ డబుల్‌ రోడ్డు, మద్దిలపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా జాతీయ రహదారిపైకి రావడంతో పోలీసులు వాహనాలను నిలిపివేశారు.

Updated Date - Jul 29 , 2026 | 12:58 AM