సంప్రదాయ వంట... లేదు గ్యాస్ తంటా!
ABN , Publish Date - May 03 , 2026 | 11:05 PM
మన్యంలోని ఆదివాసీలు తరతరాలుగా ఆచరించే పలు సంప్రదాయాలు పలువురికి ఆదర్శంగా ఉండడంతో పాటు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సాధారణ జీవనం సాగించేందుకు దోహదపడతాయనడంలో అతిశయోక్తి లేదు.
ఆదర్శంగా నిలుస్తున్న ఆదివాసీల అలవాట్లు
గ్యాస్ పొయ్యి కంటే కట్టెలతోనే వంటలు
నేటి గ్యాస్ కొరత నేపథ్యంలో గిరిజనుల దరి చేరని ఇబ్బందులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలోని ఆదివాసీలు తరతరాలుగా ఆచరించే పలు సంప్రదాయాలు పలువురికి ఆదర్శంగా ఉండడంతో పాటు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సాధారణ జీవనం సాగించేందుకు దోహదపడతాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నెలకొంది. కానీ మన్యంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కాస్త అభివృద్ధి చెందిన పట్టణాలుగా ఉన్న పాడేరు, అరకులోయ, చింతపల్లి కేంద్రాల్లో నివసించే వారికి వంట గ్యాస్ కొరత సమస్య ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఉండే గిరిజనులకు మాత్రం గ్యాస్ సమస్య ఊసేలేదు. అందుకు ఆదివాసీల వంటల తయారీ విధానమే కారణంగా చెప్పవచ్చు. గిరిజనులు పురాతన ఆచారాలు, సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. ఇందులో భాగంగానే తాము అడవులకు వెళ్లి సేకరించి తీసుకువచ్చిన వంట చెరకుతోనే తమకు అవసరమైన వంటకాలను తయారు చేసుకుంటారు.
గ్యాస్‌పై ఆధారపడకుండా వంటలు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోనూ గ్యాస్‌తోనే ఎక్కువగా వంటలు చేస్తుంటారు. కానీ ఏజెన్సీలోని అధిక శాతం గిరిజనులు నేటికీ గ్యాస్‌కు దూరంగా ఉంటూ, కేవలం వంట చెరకుతోనే వంటలు చేసుకుంటున్నారు. దీంతో గ్యాస్ కొరత, ఆలస్యంగా గ్యాస్ లభించడం, బ్లాక్ మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన సమస్యలు వారి దరి చేరలేదు. కాలక్రమంలో వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ గిరిజనుల ఆర్థిక స్థితి నేపథ్యంలో దాని జోలికి వెళ్లలేదు. తమ గ్రామానికి సమీపంలోని అడవుల్లోకి వెళితే ఉచితంగా లభించే వంట చెరకుపై గిరిజనులు ఆధారపడడం అలవాటుగా మారింది. దీంతో నేటికీ ఇదే సంప్రదాయాన్ని వారు కొనసాగిస్తున్నారు.
వంట చెరకు సేకరణపై ప్రత్యేక దృష్టి
గిరిజనులు తరతరాలుగా వంట చెరకు సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత, వేసవి సీజన్‌లో సమీపంలోని అడవులకు వెళ్లి తమకు అవసరమైన కట్టెలను సేకరించి, వాటిని ఇంటికి మోసుకుని రావడం, ఇళ్ల ముందు లేదా చెట్లపై వాటిని నిల్వచేయడం వంటివి తమ జీవనంలో ఒక భాగంగా చేసుకున్నారు. అందుకే మధ్యాహ్నం వేళల్లో ఏజెన్సీలో ఎక్కడ చూసినా కట్టెలు మోసుకువెళుతున్న గిరిజనులు కనిపిస్తారు. అలాగే గ్రామాల్లో గిరిజనుల ఇళ్ల ముందు, చెట్లపై నిల్వ చేసిన వంట చెరకు కనిపిస్తుంది. ఏజెన్సీలో వర్షాలు, వ్యవసాయ పనుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏడాదికి అవసరమైన వంట చెరకును వేసవిలో సమకూర్చుకుని భద్రపరచుకుంటారు. తమ సంప్రదాయ జీవనంలో భాగంగా ఆచరిస్తున్న ఆ విధానమే నేడు గ్యాస్ కొరతను వారి దరి చేరకుండా చేసిందనేది అక్షర సత్యం.