కదలని టోయ్‌ట్రైన్
ABN , Publish Date - May 31 , 2026 | 11:21 PM
అరకులోయలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్ అందాలను తిలకించేందుకు ఏర్పాటు చేసిన టోయ్‌ట్రైన్ మూలకు చేరింది. ఏడాదిన్నరగా సందర్శకులకు అందుబాటులో లేకుండా ఉంది.
పద్మాపురం గార్డెన్‌లో ఏడాదిన్నర క్రితం మూలకు చేరిన వైనం
అందుబాటులో లేక నిరాశకు గురవుతున్న సందర్శకులు
అరకులోయ, మే 31 (ఆంధ్రజ్యోతి): అరకులోయలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్ అందాలను తిలకించేందుకు ఏర్పాటు చేసిన టోయ్‌ట్రైన్ మూలకు చేరింది. ఏడాదిన్నరగా సందర్శకులకు అందుబాటులో లేకుండా ఉంది. టోయ్‌ట్రైన్‌లో కూర్చుని గార్డెన్ అందాలను తిలకించాలని భావించిన వృద్ధులు, చిన్నారులకు నిరాశే మిగులుతోంది.
పద్మాపురం గార్డెన్ సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు మూడు కిలోమీటర్లు పొడవున గార్డెన్‌లో అంతర్గత రహదారులు ఉన్నాయి. గతంలో టోయ్‌ట్రైన్‌లో సందర్శకులు కూర్చుని గార్డెన్ మొత్తం తిలకించేవారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బెంగాలీ పర్యాటకులు టోయ్‌ట్రైన్‌లో విహరించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే టోయ్‌ట్రైన్ మరమ్మతులకు గురై ఏడాదిన్నర క్రితం మూలకు చేరింది. దీని పెట్టెలు సైతం పాడైపోవడంతో వినియోగంలో లేకుండా ఉంది. ఈ ట్రైన్‌లో ట్రిప్‌నకు 30 మంది ప్రయాణించేవారు. ఒక ట్రిప్‌నకు టికెట్ల రూపంలో రూ.2000 వచ్చేది. పర్యాటక సీజన్‌లో 30 నుంచి 35 ట్రిప్పుల వరకు తిరిగేది. అన్‌సీజన్‌లో కనీసం 5 నుంచి 7 ట్రిప్పులు తిరిగేది. టోయ్‌ట్రైన్ ద్వారా ఆదాయం బాగా వచ్చేది. ప్రస్తుతం ఇది మూలకు చేరడంతో ఆదాయం లేకుండాపోయింది. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి టోయ్‌ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.