Share News

శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం దిశగా..

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:44 AM

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యా శాఖాధికారులు ముందుకు వెళుతున్నారు. అన్ని పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా డిసెంబరు ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 226 మంది ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించి ప్రత్యేక బోధన చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్నిబట్టి రైజింగ్‌ స్టార్స్‌, షైనింగ్‌ స్టార్స్‌గా విభజించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం దిశగా..
నర్సీపట్నం రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విద్యార్థులకు రాత్రి బోధన

టెన్త్‌ విద్యార్థులకు పక్కాగా వంద రోజుల ప్రణాళిక అమలు

నాలుగు గ్రేడ్లుగా విద్యార్థుల విభజన

డీ గ్రేడ్‌ విద్యార్థులు హాస్టలకు తరలింపు

ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యా శాఖాధికారులు ముందుకు వెళుతున్నారు. అన్ని పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా డిసెంబరు ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 226 మంది ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించి ప్రత్యేక బోధన చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్నిబట్టి రైజింగ్‌ స్టార్స్‌, షైనింగ్‌ స్టార్స్‌గా విభజించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సమయం దగ్గర పడుతుండడంతో చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం ఉత్తీర్ణులు కావడానికి ప్రత్యేక బోధన చేస్తున్నారు. గత ఏడాది వారానికి ఒకసారి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రోజూ పరీక్ష నిర్వహిస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక అమలులో భాగంగా 70 రోజుల అనంతరం ప్రతి పాఠశాలలో ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విద్యార్థులను విభజించారు. సీ, డీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 9వ తేదీ నుంచి వీరి కోసం ప్రత్యేకంగా 30 రోజుల ప్రణాళకను అమలు చేస్తున్నారు. డీ కేటగిరీకి చెందిన 250 బాలురు, 52 మంది బాలికలను సమీపంలోని వసతి గృహాలకు తరలించారు. ప్రతి ముగ్గురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించి, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులతో ’డయల్‌ యువర్‌ సబ్జెక్టు టీచర్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:44 AM