Share News

మురికివాడల రహిత నగరం దిశగా...

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:05 AM

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మురికివాడల రహిత నగరం దిశగా...

వెలంపేట మురికివాడ అభివృద్ధికి మంత్రిమండలి ఆమోదం

1986 చదరపు మీటర్లలో సిల్ట్‌+12 అంతస్తులు భవనం

177 కుటుంబాలకు ఫ్లాట్‌లు కేటాయింపు

రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి

బిల్డర్‌కు రూ.17.07 కోట్ల టీడీఆర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవీఎంసీ జోన్‌-4 35వ వార్డు పరిధిలోని వెలంపేట మురికివాడను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అక్కడ ఉంటున్న వారికి బహుళ అంతస్థుల భవనం నిర్మించి ఫ్లాట్‌లు కేటాయించనున్నారు.

జీవీఎంసీ పరిధిలోని 66 నోటిఫైడ్‌ మురికివాడలను దశలవారీగా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ ఉంటున్న వారికి ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నగర పాలక సంస్థ ప్రతిపాదనలు తయారుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధి ప్రణాళికలో మురికివాడల పునర్నిర్మాణం అంశాన్ని పొందుపరిచింది. దీంతో వెలంపేటతోపాటు రైల్వేన్యూకాలనీలోని మురికివాడలను అభివృద్ధి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌)తో డీపీఆర్‌ తయారుచేయించారు. పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత వన్‌టౌన్‌ ప్రాంతంలోని వెలంపేటను ఎంపిక చేశారు. దీనికోసం ఏపీయూఐఏఎంఎల్‌ సర్వే చేసి డీపీఆర్‌ను తయారుచేసి జీవీఎంసీకి అందజేసింది. సుమారు 49 సెంట్లు (1986 చదరపు మీటర్లు) విస్తీర్ణం కలిగిన మురికివాడలో ప్రస్తుతం 177 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి పీపీపీ విధానంలో అదే స్థలంలో అన్నిమౌలిక వసతులతో పక్కా భవానాలను నిర్మించి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. స్టిల్ట్‌+12 తరహాలో 177 కుటుంబాలకు 400 చదరపు అడుగులు వైశాల్యం చొప్పున ఫ్లాట్‌లను నిర్మించి ఉచితంగా ఇవ్వనున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేసరికి రెండేళ్లు పడుతుంది కాబట్టి అంతవరకు నిర్వాసితులు అద్దె ఇళ్లలో ఉంటారు. డెవలపర్‌ అద్దె భరించాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసినందుకు డెవలపర్‌కు రూ.17.07 కోట్లు విలువైన టీడీఆర్‌లను జారీచేస్తారు. దీనికోసం టెండర్లు పిలిచేందుకు వీలుగా అనుమతి కోసం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఇటీవల ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుదీర్ఘమైన కసరత్తు చేసిన తర్వాత పీపీపీ విధానంలో వెలంపేట మురికివాడ అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తయారుచేసిన ప్రతిపాదనపై సంతృప్తిచెందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం సమావేశమైన మంత్రిమండలి దీనిపై చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో జీవీఎంసీ అధికారులు తర్వాత దశ చర్యలకు ముందుకువెళ్లేందుకు మార్గం సుగమం అయింది.

Updated Date - Aug 07 , 2026 | 01:05 AM