పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:50 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.
జోరందుకున్న సందర్శకుల రాక
రద్దీగా మారిన పర్యాటక ప్రదేశాలు
పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. గత రెండు వారాలుగా ఉన్న రవాణా కష్టాలు ప్రస్తుతం తొలగడంతో పర్యాటకుల రాక జోరందుకుంది. దీంతో ఆదివారం ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలు కళకళలాడాయి. ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ఉదయం వేళల్లో దట్టంగా మంచు, మంచు మేఘాలు దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాట పడుతున్నారు. ఆదివారం ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల హడావుడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ సన్ రైజ్ పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు.
అరకులోయలో
అరకులోయకు పర్యాటకులు పోటెత్తడంతో సందర్శిత ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. వీరెండ్ కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో ఉడెన్‌బ్రిడ్జి, మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్, అరకులోయ ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్‌లను సందర్శించారు. అదేవిధంగా డుంబ్రిగుడకు సమీపంలో ఉన్న జలవిహారిని భారీగా పర్యాటకులు సందర్శించారు.
చింతపల్లిలో..
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. లంబసింగి జంక్షన్, చెరువులవేనం, భీమనాపల్లి, తాజంగి జలాశయం వద్దకు ఉదయం ఐదు గంటలకే పర్యాటకులు చేరుకున్నారు. చెరువులవేనంలో 11 గంటల వరకు పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. తాజంగి జలాశయంలోలో సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్‌లో పాల్గొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు.