పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:35 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. దట్టంగా మంచు కురుస్తుండడంతోపాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాట పట్టారు.
సందర్శిత ప్రదేశాలకు భారీగా వచ్చిన సందర్శకులు
మైమరపించిన ప్రకృతి అందాలు
అరకులో సందడి చేసిన బెంగాలీలు
పాడేరు/చింతపల్లి/అరకులోయ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. దట్టంగా మంచు కురుస్తుండడంతోపాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాట పట్టారు. దీంతో శనివారం మన్యంలో సందర్శకుల సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం, తదితర ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
చింతపల్లిలో..
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వీకెండ్ శనివారం లంబసింగి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందారు. యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
అరకులోయలో..
అరకులోయలో పర్యాటకుల సందడి కొనసాగుతునే ఉంది. శనివారం పెద్ద ఎత్తున సందర్శకులు సందర్శిత ప్రాంతాలను సందర్శించారు. పర్యాటకులలో అధిక శాతం బెంగాళీలే ఉన్నారు. ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ను సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదేవిధంగా గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జిను సందర్శించారు. తెలతెలవారున అరకులోయకు సమీపంలో ఉన్న మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ను పర్యాటకులు సందర్శించారు. స్థానిక గిరిమహిళలతో దింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. మంచు అందాల నడుమ సూర్యోదయాన్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించారు.