పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:27 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి కొనసాగుతున్నది. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో పర్యాటకులు మన్యానికి క్యూ కడుతున్నారు.
సందర్శనీయ ప్రాంతాలు కిటకిట
దసరా సెలవులు కావడంతో రద్దీ
ప్రకృతి అందాలను ఆస్వాదించిన సందర్శకులు
పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి కొనసాగుతున్నది. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో పర్యాటకులు మన్యానికి క్యూ కడుతున్నారు. సెలవులకు కుటుంబ సమేతంగా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. దీంతో శనివారం ఏజెన్సీలో పర్యాటకుల సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
కిటకిటలాడిన జలవిహరీ
డుంబ్రిగుడ: దసరా సెలవులు కావడంతో అరకు అందాలను తిలకించేందుకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. స్థానిక చాపరాయి జలవిహారీ, అరకు ఫైనరీలు కిటకిటలాడాయి. చాపరాయి జలవిహారీలో నూతనంగా ఏర్పాటుచేసిన రైన్ డాన్స్లో చిన్నారులతో కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేశారు. తిరుగు ప్రయాణంలో అరకు ఫైనరీలో ఎతైన చెట్ల మధ్య సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ.. ధింసా నృత్యాలు చేస్తూ.. సందడి చేశారు.
లంబసింగిలో సందడే సందడి
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా శీతాకాల వాతావరణం ప్రారంభం కావడంతో లంబసింగిలో ప్రకృతి అందాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. వీకెండ్, దసరా సెలవులు కలిసి రావడంతో శనివారం లంబసింగి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్లైన్, బోటింగ్ అందుబాటులో లేకపోవడంతో సందర్శకులు నిరాశ చెందారు. యర్రవరం జలపాతాన్ని సందర్శించారు. లంబసింగి పర్యాటకులతో రద్దీగా మారింది.
అరకులోయలో సందడి
అరకులోయ: దసరా సెలవులు కావడంతో అందాల అరకులోయకు శనివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. పర్యాటకుల రాకతో సందర్శిత ప్రాంతాలు గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్బ్రిడ్జి, మాడగడ సన్రైజ్, అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్ సందర్శకులతో కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేశారు. అదే విధంగా టూరిజం రిసార్ట్సు, ప్రయివేటు రిసార్టులు, లాడ్జీలు, హోటళ్లు రద్దీగా మారాయి. ఆటో, ట్యాక్షీలకు గిరాకీ ఏర్పడింది. చిరు వ్యాపారులకు తగిన వ్యాపారం జరిగింది.