Share News

పోటెత్తిన పర్యాటకులు

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:49 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు శుక్రవారం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంకాంత్రి నేపథ్యంలో వరుస సెలవులతో శుక్రవారం సైతం ఆదివారాన్ని తలపించేలా ఏజెన్సీకి పర్యాటకులు పోటెత్తారు.

పోటెత్తిన పర్యాటకులు
పర్యాటకులతో కిటకిటలాడుతున్న చెరువులవేనం వ్యూపాయింట్‌

పండుగ సెలవులతో మన్యం బాట పట్టిన సందర్శకులు

రద్దీగా మారిన సందర్శనీయ ప్రదేశాలు

లంబసింగి మంచు మేఘాలకు ఫిదా

కొత్తపల్లి జలపాతంలో కేరింతలు

పాడేరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు శుక్రవారం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంకాంత్రి నేపథ్యంలో వరుస సెలవులతో శుక్రవారం సైతం ఆదివారాన్ని తలపించేలా ఏజెన్సీకి పర్యాటకులు పోటెత్తారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.

చింతపల్లిలో..

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో శుక్రవారం భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. కొంత మంది పర్యాటకులు ముందు రోజే లంబసింగి వచ్చి బస చేయగా మెజారిటీ పర్యాటకులు మరుసటి రోజు ఉదయం లంబసింగి చేరుకున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్‌, చెరువులవేనం వ్యూపాయింట్‌, భీమనాపల్లి, తాజంగి జలాశయం పర్యాటకులతో కళకళలాడాయి. చెరువులవేనం వద్ద ఉదయం పదకొండు గంటల వరకు పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు. భారీ సంఖ్యలో పర్యాటకులు వ్యూపాయింట్‌ వద్దకు చేరుకోవడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. తాజంగి జలాశయంలోనూ సాహజ క్రీడలు జిప్‌లైన్‌, బోటింగ్‌ చేసేందుకు క్యూ అధికంగా ఉండడంతో పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. స్టాబెర్రీ తోటల్లో తాజా పండ్లు కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు లంబసింగి పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.

జి.మాడుగులలో..

మండలంలోని కొత్తపల్లి జలపాతంలో సినీనటుడు గోపికర్‌ శుక్రవారం సందడి చేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదించి పరవశించిపోయారు. జలపాతం అందాలు అద్భుతమన్నారు. జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేస్తూ సందడి చేశారు.

Updated Date - Jan 16 , 2026 | 10:49 PM