Share News

సందడిగా పర్యాటక స్థలాలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:14 AM

కైలాసగిరి పర్యాటకులతో శనివారం కిక్కిరిసిపోయింది.

సందడిగా పర్యాటక స్థలాలు

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరి పర్యాటకులతో శనివారం కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవులకు విశాఖపట్నం వచ్చినవారు పిల్లలతో కలసి పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమం పెట్టుకోవడంతో జంతుప్రదర్శనశాల, కైలాసగిరి, సాయంత్రం ఆర్‌కే బీచ్‌, రుషికొండ బీచ్‌లు సందడిగా కనిపించాయి. ఎక్కువ మంది సొంత వాహనాల్లో రావడంతో కైలాసగిరిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కొండపై తెలుగు మ్యూజియం కోసం వేసిన మట్టి రోడ్డులోచాలా వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఇవ్వడంతో కొంత వెసులుబాటు కలిగింది. బీచ్‌లో శనివారం కూడా పలువురు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ గంతులేశారు.


ఖైదీలు తయారుచేసిన వస్తువుల విక్రయం ద్వారా రూ.1.42 కోట్లు

సూపరింటెండెంట్‌ మహేశ్‌బాబు

ఆరిలోవ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర కారాగారంలోని వివిధ చిన్న తరహా పరిశ్రమల్లో తయారుచేసిన ఉత్పత్తుల విక్రయాల ద్వారా 2025 జనవరి నుంచి డిసెంబరు వరకూ సుమారు రూ.1.42 కోట్లు వచ్చినట్టు సూపరింటెండెంట్‌ మహేశ్‌బాబు తెలిపారు. స్టీలుతో రూపొందించిన బీరువాలు, అల్మరాలు, బెంచీలు, కుర్చీల విక్రయాల ద్వారా సుమారు రూ.85 లక్షలు, మగ్గాలపై నేసిన వస్త్రాల ద్వారా రూ.13 లక్షలు, బేకరీ ఐటమ్స్‌ ద్వారా రూ.13 లక్షలు, ఇంకా కూరగాయల విక్రయాల ద్వారా రూ.3.9 లక్షలు వచ్చినట్టు ఆయన చెప్పారు. అలాగే డెయిరీ నుంచి రూ.15.2 లక్షలు, సెమీ ఓపెన్‌ ఖైదీలు తయారుచేసిన వివిధ వస్తువుల విక్రయం ద్వారా రూ.12.6 లక్షలు వచ్చినట్టు చెప్పారు.


పోర్టు మరో రికార్టు

289 రోజుల్లోనే 70 మిలియన్‌ టన్నుల రవాణా

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేవలం 289 రోజుల్లో (ఈ నెల 14వ తేదీ నాటికి) 70 మిలియన్‌ టన్నుల (7,01,74,002) సరుకు రవాణా చేసింది. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఏనాడూ ఇంత తక్కువ వ్యవధిలో ఆ స్థాయిలో సరుకు రవాణా జరగలేదు. ఈ 70 మిలియన్‌ టన్నుల లక్ష్యం చేరడానికి 2024-25లో 316 రోజులు పట్టగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 320 రోజుల సమయం తీసుకుంది. వాటిని అధిగమిస్తూ ఈ ఏడాది కేవలం 289 రోజుల్లోనే ఆ లక్ష్యం అధిగమించింది.


21 నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

ఉమ్మడి జిల్లా నుంచి 6,000 మంది హాజరు

రెండు గంటలు ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని నిర్వాహకుల సూచన

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

జేఈఈ మెయిన్స్‌ మొదటి దశ ప్రవేశ పరీక్షలు ఈనెల 21 నుంచి 24వ తేదీ, తిరిగి 28 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకూ బీటెక్‌లో ప్రవేశాల కోసం పేపర్‌-1, 30న ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశాలకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తున్నారు. ఐఐటీలు/ఎన్‌ఐటీల ప్రవేశ ప్రక్రియలో భాగంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా రెండు దఫాలు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. నగరంలోని చినముషిడివాడలోని ఐయాన్‌ డిజిటల్‌ 1, 2 సెంటర్లు, షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌లో ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. 21వ తేదీన జరగనున్న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు శనివారం నుంచి అవకాశం ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షకు రెండు గంటల ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు పాటించాల్సిన విధానాలను హాల్‌టిక్కెట్‌లో పొందుపరిచారు. కాగా రెండో సెషన్‌ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌ తొలి వారంలో జరుగుతాయి.

Updated Date - Jan 18 , 2026 | 01:14 AM