మన్యంలో పర్యాటక సందడి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:53 PM
మన్యంలోని అరకులోయ, ముంచంగిపుట్టు మండలాల్లో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. అరకులోయలోని సందర్శిత ప్రాంతాలు, ముంచంగిపుట్టు మండలంలోని డుడుమ జలపాతం వ్యూపాయింట్ సందర్శకులతో కళకళలాడాయి.
అరకులోయకు పోటెత్తిన సందర్శకులు
కిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలు
పర్యాటకులతో కళకళలాడిన డుడుమ జలపాతం వ్యూపాయింట్
అరకులోయ/ముంచంగిపుట్టు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో శుక్రవారం పర్యాటకులు.. స్థానిక సంస్థల నామినేషన్ల అభ్యర్థులు, మద్దతుదారులతో సందడి వాతావరణం నెలకొంది. దసరా సెలవులు పూర్తి అయినప్పటికీ పర్యాటకుల రద్దీ కొనసాగుతునే ఉంది. శుక్రవారం సందర్శిత ప్రాంతాలైన గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి, అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్ పర్యాటకుల తాకిడి కనిపించింది. గాలికొండ వ్యూపాయింట్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు విచ్చేయడంతో వాహనాల రద్దీతో కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అదేవిధంగా సుంకరమెట్ట గాలికొండ వ్యూపాయింట్ వద్ద మరింత ఎక్కువ మంది సందర్శకులు ఉడెన్‌బ్రిడ్జి, ట్రీడెక్, బర్డ్‌నెస్ట్, ట్రీ రెస్టారెంట్ వద్ద సందర్శకులు సందడి చేశారు. ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు.
ముంచంగిపుట్టులో..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని డుడుమ జలపాతం వ్యూ పాయింట్ వద్ద శుక్రవారం పర్యాటకులతో కిటకిటలాడింది. రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. డుడుమ త్రిముఖ జలపాతాలు, వ్యూ పాయింట్, ఉంచాయిపడా జలపాతం, జలవిద్యుత్ ప్రాజెక్టు పరిసరాలు పర్యాటకులతో కళకళలాడింది. ఎటు చూసినా పర్యాటకులే కనిపించారు. జలపాతాలతోపాటు ప్రకృతి అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. ఇటువంటి చోట రాత్రి బస చేసేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.