మన్యంలో పర్యాటక సందడి
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:43 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు శనివారం అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి.
సందర్శకుల్ని ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు
జలవిహారిలో కేరింతలు
లంబసింగికి పర్యాటకుల తాకిడి
పాడేరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు శనివారం అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి. దీంతో శనివారం ఎక్కడ చూసినా సందర్శకులే కన్పించారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి మొదలైంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసెలు పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. ఈఏడాది మార్చి వరకు మన్యంలో పర్యాటకుల కోలాహలం కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు.
చింతపల్లిలో..
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.దీంతో లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయంలో ఉదయం ఐదు గంటల నుంచే పర్యాటకుల సందడి ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద మంచు అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. సాయంత్రం ఆరు గంటల వరకు స్ట్రాబెర్రీ తోటలు, పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి. అలాగే యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
డుంబ్రిగుడలో..
మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారిని శనివారం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు. పర్యాటక ప్రాంతలైన చాపరాయి, అంజోడ సిల్క్‌ఫాం, అరకు ఫీనరీలో పర్యాటకుల సందడి నెలకోంది. చాపరాయి జలవిహారిలో కుటుంబ సమేతంగా స్నానాలు చేశారు. గార్డెన్‌లో ఫొటోలు దిగారు. సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు.