పర్యాటక సందడి
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:23 PM
మన్యానికి పర్యాటక శోభ వచ్చింది. సందర్శిత ప్రాంతాలకు పర్యాటకులు తరలి వస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది.
లంబసింగి, చెరువులవేనం కిటకిట
అరకులోయలో ప్రకృతి అందాలకు ఫిదా
కొత్తపల్లి జలపాతంలో జలకాలాటలు
చింతపల్లి/అరకులోయ/జి.మాడుగుల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మన్యానికి పర్యాటక శోభ వచ్చింది. సందర్శిత ప్రాంతాలకు పర్యాటకులు తరలి వస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. చింతపల్లి మండలం లంబసింగిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా గిరిజన ప్రాంతంలో శీతాకాల వాతావరణం కనిపిస్తున్నది. ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నది. ఆదివారం లంబసింగి పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
అరకులోయలో..
అందాల అరకులోయను ఆదివారం పర్యాటకులు సందర్శించారు. అరకులోయలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్ల వద్ద సందర్శకులు సందడి చేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
జి.మాడుగులలో..
మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వర్షాలతో గత కొద్ది రోజులుగా పర్యాటకులు నామమాత్రంగానే వచ్చేవారు. అయితే జలపాతం పరిసరాల్లో చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులకు ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం కొత్తపల్లి జలపాతంలో స్నానాలు చేస్తూ పర్యాటకులు సందడి చేశారు. అనంతరం తారాబు జలపాతం సందర్శనకు తరలివెళ్లారు.