పర్యాటక సందడి
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:16 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో శనివారం సైతం సందడి కొనసాగింది. సంకాంత్రి పండుగకు వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి కనిపించింది.
రద్దీగా మారిన సందర్శనీయ ప్రాంతాలు
కొత్తపల్లి జలపాతంలో కేరింతలు
కిటకిటలాడిన తారాబు జలపాతం
పర్యాటకులతో అరకులోయ కళకళ
లంబసింగి కిటకిట
పాడేరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి):మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో శనివారం సైతం సందడి కొనసాగింది. సంకాంత్రి పండుగకు వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి కనిపించింది. ఏజెన్సీలోని ప్రకృతి అందాలు సుందరంగా ఉండడంతో పర్యాటక ప్రదేశాలకు జనం తరలి వస్తున్నారు. దీంతో శనివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకులు తరలివచ్చారు. దీంతో అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.
కొత్తపల్లి జలపాతం వద్ద..
జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద శనివారం సందర్శకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవులు కావడంతో మైదాన ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికంగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా సందడి చేశారు. జలపాతంలో స్నానలు చేస్తూ ఆనందంగా గడిపారు.
తారాబు జలపాతం వద్ద..
పెదబయలు: మండలంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జామిగూడ పంచాయతీలోని తారాబు జలపాతం వద్ద సందడి చేశారు. పచ్చని అడవుల మధ్య 160 నుంచి 250 అడుగుల ఎత్తైన కొండల నుంచి పాల నురుగలా జాలువారే తారాబు జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది రాష్ట్రంలో రెండో ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి చెందింది. నిత్యం ఇక్కడి వందల సంఖ్యలోను, వీకెండ్ సమయాల్లో వేల సంఖ్యల్లో సందర్శకులు వచ్చి సందడి చేస్తున్నారు.
పోటెత్తిన పర్యాటకులు
చింతపల్లి: ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. గిరిజన ప్రాంతంలో ఓవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యలో నమోదు కావడం, మంచు అందాలు కనువిందు చేస్తుండడంతో ప్రకృతి ప్రేమికులు రెక్కలు కట్టుకుని లంబసింగికి క్యూ కడుతున్నారు. శనివారం ఉదయం నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం, భీమనాపల్లిలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనంలో శ్వేత వర్ణంలో ఆకాశం నుంచి కిందకు దిగివస్తున్న మంచు మేఘాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. 11 గంటల వరకు చెరువులవేనం పర్యాటకులతో కిటకిటలాడింది. అలాగే తాజంగి జలాశయంలో జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు సందర్శించారు.
అరకులోయ కళకళ
అరకులోయ:
అందాల అరకులోయ పర్యాటకులతో కళకళలాడింది. గత రెండు రోజుల నుంచి ఎటుచూసినా సందర్శకులే కనిపిస్తున్నారు. సందర్శిత ప్రాంతాలైన ట్రైబల్ మ్యూజియం, బోటు షికారు, స్కైసైక్లింగ్, జిప్‌లైనర్‌తో పర్యాటకులు ఎంజాయ్ చేశారు. తెల్లవారకముందే మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ను పెద్ద ఎత్తున సందర్శకులు సందర్శించారు. సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జిని సందర్శకులు సందర్శించారు. దీంతో అక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. స్థానికులు, పొలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. పద్మాపురం గార్డెన్‌లో పర్యాటకులు సందడి చేశారు. ట్యాక్సీ, ఆటోవాలాలకు ఖాళీ లేదు. హోటళ్లు, రిసార్ట్సు, లాడ్జీలు ఫుల్ అయ్యాయి. చిరు వ్యాపారాలు బాగా సాగాయి.