Share News

మన్యానికి పర్యాటక శోభ

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:13 PM

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ నెలకొంది. రెండో శనివారం, ఆదివారం కావడంతోపాటు విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు.

మన్యానికి పర్యాటక శోభ
వంజంగి హిల్స్‌లో శనివారం ఉదయం సుందర దృశ్యం

సందర్శనీయ ప్రాంతాలు కిటకిట

వరుస సెలవుల నేపథ్యంలో తాకిడి

ప్రకృతి అందాలకు పర్యాటకుల ఫిదా

పాడేరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి):

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ నెలకొంది. రెండో శనివారం, ఆదివారం కావడంతోపాటు విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు. దీంతో ఆదివారాన్ని తలపించేలా శనివారం ఏజెన్సీలో పర్యాటకుల సందడి నెలకొంది. దీంతో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.

డుడుమ జలపాతాల వద్ద సందడి

ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల డుడుమ జలపాతం వ్యూపాయింట్‌ వద్ద శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మూడు జలపాతాలు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. జలపాతాల సౌందర్యాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం వ్యూపాయింట్‌, జలవిద్యుత్‌ ప్రాజెక్టు పరిసరాల్లో పర్యాటకుల సందడి అధికంగా ఉంది.

Updated Date - Oct 10 , 2026 | 11:13 PM