Share News

డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు పూర్తి

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:51 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు ఒకటి, రెండు రీచ్‌ల్లో పూర్తి కావచ్చాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌) జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు.

డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు పూర్తి
డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులను పరిశీలిస్తున్న సీలేరు కాంప్లెక్సు జెన్‌కో అధికారులు

రెండు రోజుల్లో ట్రయిల్‌ రన్‌

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌

సీలేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌ పనులు ఒకటి, రెండు రీచ్‌ల్లో పూర్తి కావచ్చాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌) జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఆదివారం ఆయన పవర్‌ కెనాల్‌లో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం రెండో దశలో 5,6 యూనిట్ల పనుల నిమిత్తం కెనాల్‌ షట్‌డౌన్‌ చేయాల్సి ఉందన్నారు. అందువల్ల పవర్‌ కెనాల్‌ నిర్వహణ పనులను గత నెల రోజులుగా చేస్తున్నామన్నారు. పవర్‌ కెనాల్‌లోని రెండు రీచ్‌ల్లో రూ.1.5 కోట్లతో అత్యవసర మరమ్మతులను చేపట్టామన్నారు. కెనాల్‌ గట్లు దెబ్బతిన్న ప్రదేశాల్లోను, లీకేజీలు ఉన్న ప్రాంతాల్లోను, కెనాల్‌ అడుగు భాగంలో బాగా దెబ్బతిన్న ప్రదేశాల్లో మరమ్మతులు చేశామన్నారు. పనులు పూర్తి కావడంతో మరోసారి వాటిని పరిశీలిస్తామని, అనంతరం మరో రెండు రోజుల్లో నీటిని కెనాల్‌లోకి విడుదల చేసి ట్రయిల్‌రన్‌ చేస్తామన్నారు. గ్రిడ్‌ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో నీటి విడుదల చేస్తామని జెన్‌కో ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 10:51 PM