మన్యానికి పర్యాటక శోభ
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:49 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంకాంత్రి నేపథ్యంలో వరుస సెలవులు, ఆదివారం వీకెండ్ కావడంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి నెలకొంది.
మన్యం బాటపట్టిన సందర్శకులు
రద్దీగా మారిన సందర్శనీయ ప్రదేశాలు
పాడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంకాంత్రి నేపథ్యంలో వరుస సెలవులు, ఆదివారం వీకెండ్ కావడంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు సందర్శనీయ ప్రదేశాలకు తరలివస్తున్నారు. దీంతో ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ సన్ రైజ్ పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువులవేనం, లంబసింగి ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
కొత్తపల్లి జలపాతంలో..
జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుంచే సందర్శకులు చేరుకొని స్నానాలు చేస్తూ సందడిగా గడిపారు. చోడవరం సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ దంపతులు, స్థానిక ఎస్‌ఐ సాయిరాంపడాల్ జలపాతం అందాలను తిలకించారు.
లంబసింగిలో
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. పర్యాటకులు ముందు రోజే లంబసింగి చేరుకుని స్థానికంగా బస చేయగా.. మెజారిటీ సందర్శకులు మరుసటి రోజు ఉదయం లంబసింగికి వచ్చారు. ఉదయం నుంచే లంబసింగి జంక్షన్, చెరువులవేనం, భీమనాపల్లి, తాజంగి జలాశయం పర్యాటకులతో నిండుకుంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో పర్యాటకులు వణుకుతూ మంచు అందాలను తిలకించారు. తాజంగి జలాశయంలోనూ సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు.