Share News

పర్యాటక ప్రాంతాలు కిటకిట

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:41 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి.

పర్యాటక ప్రాంతాలు కిటకిట
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు

వీకెండ్‌తో పాటు అరకు ఉత్సవ్‌ ప్రభావం

సందర్శనీయ ప్రదేశాల్లో సందడి

పాడేరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. వీకెండ్‌ కావడంతో పాటు అరకు ఉత్సవ్‌ ముగింపు నేపథ్యంలో అధిక సంఖ్యలో జనం మన్యానికి తరలివచ్చారు. దీంతో ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. దీంతో అరకులోయ, తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి.

లంబసింగికి పర్యాటకుల తాకిడి

చింతపల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్‌ ఆదివారం ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం, భీమనాపల్లి, తాజంగి జలాశయం, లంబసింగి జంక్షన్‌ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. పదకొండు గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు. తాజంగి జలాశయంలో సాహసక్రీడలు జిప్‌లైన్‌, బోటింగ్‌ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.

Updated Date - Feb 01 , 2026 | 11:41 PM