ఉత్సవాలతో టూరిజం ప్రాజెక్టులు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:23 AM
రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు అనకాపల్లి ఉత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి అనకాపల్లి ఉత్సవ్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంపునకు ప్రభుత్వం కృషి
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
ఉర్రూతలూగించిన సినీ గాయకులు సునీత, ధనుంజయ్ సంగీత విభావరి
తుమ్మపాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు అనకాపల్లి ఉత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి అనకాపల్లి ఉత్సవ్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షించిన, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నదని అనకాపల్లి జిల్లాను పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనకాపల్లి ఉత్సవ్‌తో జిల్లాలో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వస్తాయని, తద్వారా స్థానికులకు ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, కనుమరుగవుతున్న సంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అనకాపల్లి ఉత్సవ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, కూటమి పాలనలో అనకాపల్లి జిల్లా దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, తొలిసారి అనకాపల్లి ఉత్సవ్‌ను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత ్సవ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పీవీజీ కుమార్, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, కూటమి నాయకులు పప్పల చలపతిరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బుద్ద నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఉర్రూతలూగించిన సంగీత విభావరి
ప్రముఖ సినీ గాయకులు సునీత, ధనుంజయ్‌ల సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పలు గీతాలను ఆలపించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, ఇతర హీరోలు నటించిన సినిమాల్లోని పాటలు ఆలపించినప్పుడు స్టేడియం మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగింది.
ఫుడ్ స్టాల్స్ కిటకిట
ఉత్సవ్‌లో భాగంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టాల్స్ కిటకిటలాడాయి. ఒక పక్క సంగీత విభావరిని ఆస్వాదిస్తూనే.. మరోపక్క ఇష్టమైన తినుబండారాలను ఆరగించారు. ప్రధానంగా బెల్లంతో తయారుచేసిన పలు పదార్థాలు, మాడుగుల స్పెషల్ హల్వా స్టాల్స్ వద్ద రద్దీ అధికంగా కనిపించింది.
ఆకట్టుకున్న కార్నివాల్
అనకాపల్లి టౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ మార్కెట్ యార్డు నుంచి స్టేడియం వరకు నిర్వహించిన కార్నివాల్ సందడిగా సాగింది. పులివేషాలు, దేవతామూర్తుల వేషంలో కళాకారులు, పొడుగు కాళ్ల మనుషులు, కోలాటాలు, సింహాద్రి అప్పన్న తోడపెద్దు సేవ వంటి వాటితో కార్నివాల్ సాగింది.