పడకేసిన పర్యాటకం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:02 AM
అల్లూరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అడుగులు పడడం లేదు. గత రెండు దశాబ్దాలుగా పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి పాలకులు దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లాలో పర్యాటకం అంటే సహజ సిద్ధమైన అందాలను తిలకించడమే అన్నట్టుగా సాగుతున్నది. సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకునే అందాలున్నప్పటికీ, వాటికి మెరుగులుదిద్ది మరింతగా సందర్శకుల్ని రప్పించేందుకు చర్యలు చేపట్టడడం లేదు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన్యంలో పర్యాటకంపై ప్రత్యేక కథనం.
పాలకుల నిర్లక్ష్యం... పర్యాటకానికి శాపం
రెండు దశాబ్దాలుగా మారని విశాఖ మన్యం
పర్యాటకం అంటే ప్రకృతి అందాలకే పరిమితమా?
కొత్త అందాల అన్వేషణ, వినోద, సాహస క్రీడల ఊసే లేదు
ప్రతిపాదనల్లోనే హోమ్‌స్టేలు, కారవాన్ టూరిజం ప్రాజెక్టులు
ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లోనే ఈట్ స్ర్టీట్, ట్రైబల్ హట్ ప్రాజెక్టులు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
(ఆంధ్రజ్యోతి- పాడేరు/అరకులోయ)
ఎత్తయిన కొండల నడుమ జలపాతాలు.. మలుపుల ఘాట్ మార్గాలు.. కాఫీ తోటలు.. వింత గొలుపే గిరిజనుల ఆచారాలు, బొర్రా గుహలు.. మాడగడ సన్‌రైజ్ పాయింట్.. ఆంధ్ర కశ్మీర్ లంబసింగి.. చెరువులవేనం, వంజంగి హిల్స్‌ల్లో మంచు మేఘాలు... అరకులోయలో ప్రకృతి అందాలు.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సందర్శిత ప్రాంతాలు అల్లూరి జిల్లా సొంతం. ఇక్కడ ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక టూర్‌లకు విశాఖ మన్యానికి తరలివచ్చేవారు. ఇక్కడి సహజసిద్ధ ప్రకృతి అందాలు పర్యాటకులను మైమరపిస్తాయి. అయితే రెండు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే ఇక్కడ పర్యాటక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ప్రకృతి అందాలకు మెరుగులుదిద్ది పర్యాటకులను మరింతగా పెంచేందుకు పాలకులు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఆంధ్ర కశ్మీర్, కేరళ అంటూ కితాబు ఇస్తున్నా... పర్యాటకాభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కొత్త అందాల అన్వేషణ.. వినోద, సాహస క్రీడలు.. వంటివి లేనేలేవు. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలే చేయడం లేదు.
ప్రతిపాదనల్లోనే హోమ్‌స్టేలు, కారవాన్ టూరిజం ప్రాజెక్టులు
మన్యంలోని కొత్తగా పర్యాటకాభివృద్ధి చేపట్టేందుకు గతేడాది కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో అరకులోయ, లంబసింగి, మారేడుమిల్లి క్లస్టర్లుగా హోమ్ స్టే టూరిజం ప్రాజెక్టును చేపట్టాలని భావించారు. అందుకుగానూ స్వదేశీ దర్శన్‌లో కేంద్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే వాటిని పరిశీలించిన అనంతరం కేంద్రం జిల్లాకు నిధులు కేటాయిస్తే.. అప్పుడు హోమ్ స్టే టూరిజం అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. కాని ఏడాది కాలంగా అవన్నీ కాగితాలనే పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా పాడేరు డివిజన్ పరిధిలో అరకులోయ మండలం మాడగడ, ముంచంగిపుట్టు మండలం సుజనకోట, చింతపల్లి మండలం లంబసింగిలో మూడు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమిల్లి, రంపచోడవరం మండలం గాంధీనగరంలో రెండు చోట్ల కారవాన్‌టూరిజం పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని గతేడాది అధికారులు భావించారు. కాని నేటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
పెండింగ్‌లోనే ఈట్ స్ర్టీట్, ట్రైబల్ హట్ ప్రాజెక్టులు
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా 2018లో మంజూరు చేసిన ఈట్ స్ర్టీట్, ట్రైబల్ హట్ ప్రాజెక్టులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. అరకులోయలోకు సమీపంలోని కొత్తవలస ఉద్యావన శిక్షణ కేంద్రంలోని 18 ఎకరాల స్థలంలో రూ.7 కోట్లతో పర్యాటకాభివృద్ధికి 2018లోనే శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అక్కడ విదేశాల తరహాలో ఈట్ స్ట్రీట్‌ను ఏర్పాటు చేసి... వివిధ ప్రాంతాలు, విదేశాల పర్యాటకులు అవసరమైన అనేక రకాల ఆహార పదార్థాలను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు గానూ కొత్త మేరకు పనులు చేపట్టారు. కాని నిధుల సమస్య కారణంగా కేవలం 50 శాతం పనులు చేసి ప్రాజెక్టును పెండింగ్ పెట్టారు. అలాగే ట్రైబల్ హట్ ప్రాజెక్టు పరిస్థితి అంతే. దానిని సగంలోనే వదిలేశారు. హరిత హిల్ రిస్టార్స్ ఆవరణలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ప్రాజెక్టును 2019లోనే ప్రారంభించినప్పటికీ పలు కారణాలతో నేటికీ వినియోగానికి నోచుకోలేదు. అనంతగిరి మండలంలోని కటిక జలపాతానికి రూ.12కోట్ల తారురోడ్డు మంజూరై మూడేళ్లవుతున్నా నేటికీ పూర్తికాలేదు. తాడిగూడ జలపాతానికి రూ.6కోట్లతో రోడ్డు మంజూరైనా పనులు జరగడం లేదు. ఇదే పరిస్థితి పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌లోనూ నెలకొంది. అక్కడ రోడ్డు నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరైన రెండేళ్లవుతున్నా నేటికీ రోడ్డు పూర్తికాలేదు. పర్యాటకాభివృద్ధికి గాని, పర్యాటక ప్రదేశాల్లో సదుపాయాల కల్పనకు గాని కనీస ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కన్పించడం లేదు.
ప్రతి ఏడాది పది లక్షల మంది పర్యాటకులు రాక
ఏజెన్సీలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రతి ఏడాది పది లక్షల మంది మన్యాన్ని సందర్శిస్తున్నారనేది ఒక అంచనా. అంతటి ప్రాధాన్యత గల ప్రదేశాలున్నప్పటికీ పర్యాటకంగా గిరిజన ప్రాంతాన్ని ఉన్నత శిఖరానికి తీసుకువెళ్లేందుకు పాలకులు కనీసం కృషి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏజెన్సీకి విచ్చేస్తున్న అధిక సంఖ్యలోని పర్యాటకులు, మరో ప్రాంతానికి విచ్చేస్తే, ఆయా ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. కాని పాలకులు గిరిజన ప్రాంతంలోని పర్యాటకాభివృద్ధికి ఆశించిన స్థాయిలో శ్రద్ధ కనబరచకపోవడంతో మన్యం పర్యాటకాభివృద్ధికి నోచుకోని దుస్థితి కొనసాగుతున్నది.