పర్యాటకం జోరు
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:17 PM
ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా పర్యాటకుల కోలాహలమే కనిపిస్తోంది. ఏజెన్సీలో ప్రకృతి అందాలతో పాటు సందర్శనీయ ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు.
దసరా సెలవుల నుంచి ఊపందుకున్న పర్యాటకుల సందడి
ఇప్పటికే జిల్లాలోని టూరిజం రిసార్ట్స్‌లో రూమ్‌లన్నీ ఫుల్
హోటళ్లు, లాడ్జీలు సైతం రద్దీ
ఈ ఏడాది టూరిజం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంచనా
(ఆంధ్రజ్యోతి- పాడేరు/అరకులోయ)
ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా పర్యాటకుల కోలాహలమే కనిపిస్తోంది. ఏజెన్సీలో ప్రకృతి అందాలతో పాటు సందర్శనీయ ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో జిల్లాలోని టూరిజం హోటళ్లు మొత్తం గత వారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బుక్ అయిపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, లంబసింగిలోని టూరిజం రిసార్టుల్లోని రూములన్నీ ఫుల్ అయ్యాయి.
విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో ప్రస్తుతం పర్యాటకులు మన్యం బాట పట్టారు. దీంతో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం, తదితర ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
టూరిజం రిస్టార్టుల్లో రూములన్నీ ఫుల్
ప్రస్తుతం పర్యాటక సీజన్ జోరందుకుంటుండంతో టూరిజం రిసార్టులతో పాటు ప్రైవేటు లాడ్జీల్లోనూ రూమ్‌ల బుకింగ్‌లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అరకులోయ, అనంతగిరిలోని టూరిజం రిసార్టులు బుక్ అయ్యాయి. అనంతగిరి మండలం టైడాలోని ప్రస్తుతం ఉన్న 9 రూమ్‌లు, అనంతగిరిలోని హరిత రిసార్ట్సులో 26 రూమ్‌లు ఈనెల 20 వరకు బుక్ అయ్యాయి. అలాగే అరకులోయలో మయూరి హిల్ రిసార్ట్స్‌లో ఉన్న 98 రూమ్స్ ఇప్పటికే బుకింగ్‌లో ఉండగా, యాత్రి నివాస్‌లో 58 రూమ్‌లు ఈ నెల 20 వరకు బుక్ అయ్యాయని టూరిజం మేనేజర్ దేముడుబాబు తెలిపారు. అలాగే ప్రైవేటు హోటళ్లు, లాడ్జీల్లోని పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఇప్పటి నుంచి దాదాపుగా జనవరి నెలాఖరు వరకు రూమ్‌లు దశల వారీగా బుక్ అవుతాయని ప్రైవేటు హోటళ్లు, రిసార్టులు యజమానులు అంటున్నారు.
ప్రతి ఏటా పది లక్షల మంది మన్యం సందర్శన
అటు రంప ఏజెన్సీ, ఇటు విశాఖ మన్యంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రతి ఏటా పది లక్షల మంది గిరిజన ప్రాంతాలను సందర్శిస్తున్నారనేది ఒక అంచనా. అంతటి ప్రాధాన్యత గల ప్రదేశాలున్నప్పటికీ, పర్యాటకంగా గిరిజన ప్రాంతాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఆశించిన స్థాయిలో కృషి జరగడం లేదనే బలగా వినిపిస్తున్నది. సహజ సిద్ధంగా, సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రదేశాల్లో సదుపాయాల కల్పనతో పాటు పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా అందాలను తీర్చిదిద్డడం వంటివి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.