Share News

పర్యాటక శాఖ అడ్డగోలు దోపిడీ

ABN , Publish Date - May 16 , 2026 | 10:45 PM

పర్యాటక శాఖకు చెందిన గోష్టి ఆడిటోరియంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా వేలాది రూపాయలకు అద్దె వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడిటోరియంలో ఉన్న ఏసీలు పనిచేయవు.. ఫ్యాన్లు తిరగవు.. చేతులు కడిగేందుకు అవసరమైన ట్యాపులు లేవు.. దీంతో ఫంక్షన్లకు వచ్చిన వారంతా నానా అవస్థలు పడుతున్నారు.

పర్యాటక శాఖ అడ్డగోలు దోపిడీ
గోష్టి ఆడిటోరియంలో భోజనాలు చేసే హాల్‌లో ఒక్క ఫ్యాన్‌ పనిచేయని దృశ్యం

సౌకర్యాలు లేకుండా అద్దెకు గోష్టి ఆడిటోరియం

కొన్ని గంటలకు రూ.40 వేలు వసూలు

ఏసీలు పనిచేయవు.. ఫ్యాన్లు తిరగవు..

ఫంక్షన్లకు వచ్చిన వారు నానా అవస్థలు

ఏవీ లేకుండా అద్దెకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఫంక్షన్ల నిర్వాహకులు

అరకులోయ, మే 16 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో పర్యాటక శాఖకు చెందిన గోష్టి ఆడిటోరియాన్ని సౌకర్యాలు లేకుండా అధిక అద్దె వసూలు చేస్తుండడంతో ఫంక్షన్ల నిర్వాహకులు మండిపడుతున్నారు. హరిత వేలీ రిసార్టు ప్రాంగణంలో ఉన్న గోష్టి ఆడిటోరియంలో మెయిన్‌ హాల్‌ సీసీతో ఉంటుంది. ఈ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ఓ ప్రయివేటు మేరేజ్‌ రిసెప్షన్‌కు వచ్చిన వారంతా నానా అవస్థలు పడ్డారు. ఏసీ అరకొరగా పనిచేసింది. మరో హాల్‌లో పది ఫ్యాన్‌లు ఉన్నా ఒక్కటీ పనిచేయలేదు. ఎంట్రెన్‌లో చిన్న హాల్‌ ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాన్‌లలో కేవలం ఒక్కటే పనిచేస్తుంది. టాయిలెట్స్‌ నిర్వహణ మరీ దారుణంగా ఉంది. ఇలా అరకొరగా సౌకర్యాలు ఉండే గోష్టి ఆడిటోరియాన్ని టూరిజం శాఖ రూ.40 వేలు అద్దె వసూలు చేయడాన్ని బుక్‌ చేసుకున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆడిటోరియం పక్కనే ఉన్న చిన్న ఖాళీ స్థలంలో వంటలు చేసుకునేందుకు మరో రూ.40 వేలు అద్దె రూపంలో వసూలు చేస్తున్నారు. ఆడిటోరియంలో టాయిలెట్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. ఫంక్షన్లు జరిగిన సమయంలో భోజనాలు చేసిన వారు చేతులు కడుగుకునేందుకు తక్కువ ట్యాప్‌లు ఉండడంతో వేచి చూడాల్సి వస్తోంది. గోష్టి ఆడిటోరియాన్ని అధికారులు అరకొరగా రెనోవేషన్‌ చేసి అద్దెకు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గురువారం కాఫీబోర్డు అధికారులు నిర్వహించిన సమావేశంలో ఏసీలున్న హాల్‌లో పెద్దపెద్ద కూలర్స్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. అరకొర సౌకర్యాలతో అద్దెకు ఎందుకు ఇస్తున్నారని ఫంక్షన్‌ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీటీడీసీ ఉన్నతాధికారులు స్పందించి గోష్టి ఆడిటోరియంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇవ్వాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 16 , 2026 | 10:45 PM