పర్యాటక శాఖ హడావిడి
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:21 AM
విశాఖ ఉత్సవ్ అంటూ కింద మీదా పడుతున్న పర్యాటక శాఖాధికారులు ‘భీమిలి ఉత్సవ్’ అని కొత్త పల్లవి అందుకొని పప్పులో కాలేశారు. ఈ నెల 24న ప్రారంభమైన విశాఖ ఉత్సవాలు మొక్కుబడిగా జరుగుతున్నాయని, భీమిలిలో ఉత్సవ్ నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ తరువాత పూర్తిగా విస్మరించారని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ‘మొక్కుబడిగా...’ శీర్షికతో కథనం ప్రచురించింది.
‘భీమిలి ఉత్సవ్’ అంటూ
అప్పటికప్పుడు కార్యక్రమాల ప్రకటన
హాజరు కావాలని ఎమ్మెల్యే గంటాకు ఆహ్వానం
రాత్రి 7.30 గంటలైనా ఏర్పాట్లు
పూర్తికాకపోవడంతో ఎమ్మెల్యే అసహనం
విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్ అంటూ కింద మీదా పడుతున్న పర్యాటక శాఖాధికారులు ‘భీమిలి ఉత్సవ్’ అని కొత్త పల్లవి అందుకొని పప్పులో కాలేశారు. ఈ నెల 24న ప్రారంభమైన విశాఖ ఉత్సవాలు మొక్కుబడిగా జరుగుతున్నాయని, భీమిలిలో ఉత్సవ్ నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ తరువాత పూర్తిగా విస్మరించారని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ‘మొక్కుబడిగా...’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులతో అప్పటికప్పుడు చర్చించి భీమిలిలో మంగళ, బుధవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ‘ఉత్సవ్’ పేరుతో నిర్వహిస్తామని షెడ్యూల్ రూపొందించారు. ఆ జాబితా పట్టుకొని మధ్యాహ్నం 12 గంటలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్దకు వెళ్లారు. భీమిలిలో 29న బోటింగ్ పోటీలే కాకుండా, దానికి ముందుగా రెండు రోజులు (మంగళ, బుధవారాలు) ఇతర కార్యక్రమాలు చేపడతామని, స్థానిక ఎమ్మెల్యేగా వాటికి హాజరుకావాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అప్పటికప్పుడు నిర్ణయించిన ఈ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్ల బాధ్యతను అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఒక వ్యక్తికి సబ్ కాంట్రాక్టుకు ఇచ్చారు. సదరు వ్యక్తి సరంజామా అంతా సమకూర్చుకొని వేదిక ఏర్పాట్లు పూర్తిచేసేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయింది. అయితే ఎమ్మెల్యే గంటాకు సాయంత్రం ఆరు గంటలకే కార్యక్రమాలు ప్రారంభం అని పర్యాటక శాఖాధికారులు చెప్పారు. ఆయన రాత్రి 7.30 గంటల వరకు వేచి చూసి, తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ వెనుతిరిగి వచ్చేశారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజలు కూడా వంద మంది కంటే ఎక్కువ హాజరుకాకపోవడం గమనార్హం. ఎటువంటి ప్రచారం, కార్యక్రమాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో ఏదో జరుగుతున్నదని తెలిసినా ఎవరూ అటు వైపు వెళ్లలేదు. విశాఖ ఉత్సవాలలో సమన్వయం, ప్రణాళికాలోపం మరోసారి బయటపడింది.