Share News

కొండకర్ల ఆవకు పర్యాటక శోభ!

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:55 AM

ఉత్తరాంధ్రలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన జిల్లాలోని కొండకర్ల ఆవకు త్వరలో పర్యాటక శోభ రానుంది. దీనిని వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు-1972 కింద పరిరక్షణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రకృతి అందాలు, వలస పక్షులు, జీవ వైవిఽధ్యానికి నిలయమైన ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

కొండకర్ల ఆవకు పర్యాటక శోభ!
కొండకర్ల ఆవ సరస్సు

- ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం

- ఏర్పాటు కానున్న బోటింగ్‌ పాయింట్లు, రిసార్ట్స్‌, జెట్టీ, నడక మార్గాలు

- సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగేలా ప్రణాళిక

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్రలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందిన జిల్లాలోని కొండకర్ల ఆవకు త్వరలో పర్యాటక శోభ రానుంది. దీనిని వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్టు-1972 కింద పరిరక్షణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రకృతి అందాలు, వలస పక్షులు, జీవ వైవిఽధ్యానికి నిలయమైన ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

తాజాగా కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటించేందుకు వీలుగా జలవనరుల శాఖ పలు షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) జారీ చేసింది. వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది. విదేశీ వలస పక్షుల స్థావరాలను రక్షించడం, వేట, ఆక్రమణలను నిరోధించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో మరెక్కడా లేని విధంగా కొండకర్ల ఆవ ప్రాంతం అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో సుమారు 1,863 ఎకరాల విస్తీర్ణం, 14 కిలోమీటర్ల వైశాల్యం కలిగి వుంది. సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం 180.9 మిలియన్‌ ఘనపుటడుగులు. ఆవ ఆయకట్టు సుమారు రెండు వేల ఎకరాలు ఉంటుంది. శారదా నది నుంచి కృష్ణంరాజు కాలువ ద్వారా ఆవలోకి వర్షపు నీరు చేరుతుంది. సుమారు 200 మత్స్యకార కుటుంబాలు ఆవలో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొండకర్ల ఆవను 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసింది. సెజ్‌లో ఒక కర్మాగారం సీఎస్‌ఆర్‌ నిధులతో కొండకర్ల ఆవను అభివృద్ధి చేసేందుకు ఎంఓయూ చేసుకున్నా కార్యరూపం దాల్చలేదు. తరువాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కొండకర్ల ఆవ అభివృద్ధి పనులు పడకేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ఆవ ప్రాంతం అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కొండకర్ల ఆవ ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పర్యాటకులను ఆకర్షించేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. ఆవను జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి.

చేపట్టనున్న అభివృద్ధి పనులు

కొండకర్ల ఆవ వద్ద సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో పలు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. బోటింగ్‌, జెట్టీ నిర్మాణం, పర్యాటకుల కోసం రిసార్ట్స్‌, విశ్రాంతి గదులు, వాకింగ్‌ ట్రాక్‌లు, వ్యూపాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు బలహీనపడిన ఆవగట్లను పటిష్టపరిచే పనులు, పరిసరాల సుందరీకరణ, పచ్చదనం పెంపు వంటి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. సందర్శకులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

ప్రత్యేక స్టాల్స్‌తో యువతకు ఉపాధి

ఆవ ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక హస్తకళలు, గ్రామీణ ఉత్పత్తులు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. పక్షుల వీక్షణకు ప్రత్యేక వ్యూపాయింట్‌లను ఏర్పాటు చేయనున్నారు. కొండకర్ల ఆవను కన్జర్వేషన్‌ రిజర్వుగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా సరస్సులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోనున్నారు. పరిసరాల్లో చెత్త పారవేతను పూర్తిగా నియంత్రించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పక్షుల ఆవాసాలను కాపాడడం, సరస్సు పరిసరాల్లో పర్యావరణ హిత చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యాటక అభివృద్ధితో స్థానిక యువతకు బోటింగ్‌, గైడ్‌ సేవలు, హోటళ్లు, హస్తకళల విక్రయం, రవాణా తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:55 AM