Share News

పర్యాటకం జోరు

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:05 AM

విశాఖపట్నంలో పర్యాటక రంగం పరుగులు తీస్తోంది. అందమైన బీచ్‌లతో అతి పెద్ద కాస్మోపాలిటన్‌ నగరంగా, ఆర్థిక రాజధానిగా పేరొందడంతో ప్రభుత్వం ఇక్కడే ఎక్కువగా దృష్టి పెట్టింది.

పర్యాటకం జోరు

17 ప్రాజెక్టులు, రూ.5,183 కోట్ల పెట్టుబడులు

క్రూయిజ్‌, కారవాన్లు అందుబాటులోకి వస్తే మరింత ఊపు

డిసెంబరు 25, 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పర్యాటక రంగం పరుగులు తీస్తోంది. అందమైన బీచ్‌లతో అతి పెద్ద కాస్మోపాలిటన్‌ నగరంగా, ఆర్థిక రాజధానిగా పేరొందడంతో ప్రభుత్వం ఇక్కడే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఏడాది కాలంలో పదిహేడు ప్రాజెక్టుల (స్టార్‌ హోటళ్లు, రిసార్ట్‌లు)కు భూములు కేటాయించింది. వాటి ద్వారా రూ.5,183 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తొమ్మిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిని రెండేళ్లలో పూర్తి చేయించాలని పర్యాటక శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి నెలా ఈవెంట్‌

పర్యాటకులను ఆకర్షించేలా ప్రతి నెలా ఒక ఈవెంట్‌ నిర్వహించాలనే లక్ష్యంతో క్యాలెండర్‌ తయారు చేసుకొని ఆ దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబరులో దసరా ఉత్సవాలు, డిసెంబరు 25 నుంచి 27 వరకు విశాఖ ఉత్సవ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీచ్‌ రోడ్డులో బస్సులు

గత ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా హాప్‌ ఆన్‌-హాప్‌ ఆఫ్‌ బస్సులను ప్రారంభించారు. ఇవి ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు నడుస్తున్నాయి. ఆదరణ బాగుండటంతో ఇంకో బస్సును జత చేశారు. ప్రస్తుతం రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులు, ఒక ఓపెన్‌ టాప్‌ బస్సు తిరుగున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు 18,800 మంది పర్యాటకులు ప్రయాణించగా, రూ.44 లక్షల ఆదాయం సమకూరింది. పర్యాటక శాఖ డ్రైవర్లను సమకూర్చగా, బస్సుల నిర్వహణ, ఆదాయ, వ్యయాలను స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చూస్తోంది.

పర్యాటకంలో డిజిటలైజేషన్‌

మాధవి, జిల్లా పర్యాటక శాఖాధికారిణి

ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘డిజిటల్‌ అజెండా అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టు రీడిజైన్‌ టూరిజం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌, ఏఐ టూల్స్‌ వినియోగం పెంచాలనేది ఉద్దేశం. ఇప్పటికే ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. హోమ్‌ స్టేలు అన్నీ ఆన్‌లైన్‌ చేశాం. ఒక గది అంత కంటే ఎక్కువ మందికి ఆతిథ్యం ఇవ్వకలిగే వారంతా నేరుగా పర్యాటక శాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. దీనికి పోలీస్‌, ఇతరత్రా అధికారుల పరిశీలన కార్యక్రమం రద్దు చేశాం. పర్యాటకులు కూడా ఆన్‌లైన్‌లోనే నచ్చిన హోమ్‌స్టే ఎంచుకోవచ్చు. అదేవిధంగా పర్యాటక శాఖ నిర్వహించే రిసార్ట్‌ల్లో బుకింగ్స్‌ అన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తున్నాం.

అవి కూడా అందుబాటులోకి వస్తే...

విశాఖలో సుదీర్ఘమైన తీర ప్రాంతం, రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌ ఉంది. అలాగే అరకులోయ, లంబసింగి వంటి ప్రాంతాలకు వెళ్లడానికి కారవాన్‌ టూరిజానికి డిమాండ్‌ ఉంది. వీటిని కూడా అతి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటకం మరింత జోరు అందుకుంటుంది.

ఎనిమిది నెలల్లో 1.75 కోట్ల మంది పర్యాటకుల సందర్శన

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 1,74,93,083 మంది పర్యాటకులు విశాఖపట్నం సందర్శించారు. వారిలో 23,487 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.

జనవరి 27,33,214

ఫిబ్రవరి 21,42,169

మార్చి 17,17,532

ఏప్రిల్‌ 19,16,324

మే 23,85,597

జూన్‌ 20,49,356

జూలై 25,20,342

ఆగస్టు 20,28,549

Updated Date - Sep 27 , 2026 | 01:05 AM