జడ్పీటీసీ స్థానానికి గట్టి పోటీ!
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:19 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీలో జడ్పీటీసీ స్థానానికి ఊహించని పోటీ ఏర్పడింది.
కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కావడమే కారణం
అధికార, విపక్ష పార్టీల్లోనూ భారీగా ఆశావహులు
ఒక్కో స్థానానికి కనిష్ఠంగా ఐదుగురు, గరిష్ఠంగా పది మంది పోటీ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీలో జడ్పీటీసీ స్థానానికి ఊహించని పోటీ ఏర్పడింది. ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండే జిల్లా పరిషత్... గత నెల నుంచి ఈ జిల్లాలో ఉండడంతో జడ్పీటీసీ స్థానానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఎంపీపీ పదవి కంటే జడ్పీటీసీ సభ్యుడు కావడమే ముఖ్యమనే ధోరణిలో ఆశావహులున్నారు.
ప్రతి మండలంలోనూ జడ్పీటీసీ టికెట్ కోసం ఐదు నుంచి పది మంది పోటీ పడుతున్నారు. ఇదే పరిస్థితి కూటమి, వైసీపీలో సైతం నెలకొంది. దీంతో జడ్పీటీసీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. రిజర్వేషన్, వారికున్న బలాబలాలు కచ్చితంగా విజయం సాధించేలా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియే చర్చనీయాంశంగా మారింది.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకే...
నూతనంగా జిల్లా ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం కలిగింది. దీంతో జడ్పీ చైర్మన్, సభ్యులుగా ఉండే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఈసారి జడ్పీటీసీ స్థానంపై అందరి దృష్టి పడింది. ఇన్నాళ్లు విశాఖపట్నంలోనే జడ్పీ చైర్మన్ ఉండడంతో పాటు ఈ ప్రాంతానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు చైర్మన్ ఎన్నికకు ఓటింగ్, ఇతర మీటింగ్లకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం విశాఖపట్నం జడ్పీ చరిత్రలో కేవలం మూడు మార్లు మాత్రమే గిరిజనులు చైర్మన్ పదవులను పొందారు. కానీ స్థానికంగానే జిల్లా పరిషత్ ఏర్పడడంతో ఇక నుంచి ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో గిరిజనులే చైర్మన్గా ఉండే అవకాశం ఉండడంతో అందరి దృష్టి దానిపై పడింది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు
జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు.. మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 612 పోలింగ్ కేంద్రాలున్నాయి. అలాగే మొత్తం 4 లక్షల 98 వేల 467 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2 లక్షల 41 వేల 447 మంది, మహిళలు 2 లక్షల 56 వేల 997 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65 వేల 374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38 వేల 286 మంది ఓటర్లున్నారు. అలాగే అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు.