Share News

ముంచెత్తిన వాన

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:27 PM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ వ్యాప్తంగా గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి.

ముంచెత్తిన వాన
కొట్టుకుపోయిన జీకే వీధి మండలంలోని చుక్కగొయ్యి కల్వర్టు

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు

పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ప్రమాదాలు జరగకుండా గెడ్డలు, కాజ్‌వేల వద్ద సిబ్బంది కాపలా

పాడేరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ వ్యాప్తంగా గెడ్డలు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఎక్కడికక్కడ వంతెనలు, కాజ్‌వేల పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. గురువారం పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే మార్గంలో మత్స్యపురం వద్ద మెయిన్‌రోడ్డు పైనుంచి వరద నీరు ప్రవహించడంతో కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి మండలంలోని చెరువూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 16 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. జీకేవీధి మండలంలో చుక్కగొయ్యి, చామగెడ్డ కల్వర్టులు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలకు గెడ్డలు, వంతెనల వద్ద వరదనీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందిని కాపలాగా పెట్టారు. ప్రజలు గెడ్డలు, వాగులు, వంతెనలు దాటకుండా అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ టి.నిషాంతి కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా వరదల పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరదల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా రోడ్లు గండ్లు పడినా, వంతెనలు దెబ్బతిన్నా తక్షణమే యంత్రాంగం స్పందించి మరమ్మతులు చేపడుతున్నారు.

జీకేవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో గురువారం కూడా భారీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. గొందిపల్లి, వైగొందిపల్లి గ్రామాల్లో సుమారు 20 ఎకరాల వరి పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరద ప్రవాహానికి చుక్కగొయ్యి కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు 10 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏ.ధారకొండ పంచాయతీ చామగెడ్డ అప్రోచ్‌ కల్వర్టు కొట్టుకుపోయింది. పనసపల్లిబంద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో 15 గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షానికి నానిపోయిన చీడిగొంది ఎంపీపీ పాఠశాల కూలిపోయింది. పాఠశాలకు సెలవు కావడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. వర్షం వల్ల పెదవలస వారపు సంత రద్దు అయింది. కాగా రంపుల, ధారకొండ ఘాట్‌లో సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు.

కొయ్యూరులో...

కొయ్యూరు: మండల వ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షం కురిసింది. జాతీయ రహదారి 516-ఈ చింతాలమ్మఘాట్‌ మూడవ మలుపు వద్ద కొండచరియలు విరిగి రక్షణ గోడ ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా మట్టి, రాళ్లు పడ్డాయి. దీంతో అటుగా కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో మట్టి, రాళ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాగా అడ్డతీగల మండలం వీరవరం సమీప గొట్టెలపాడు వద్ద బండిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో యు.చీడిపాలెం పంచాయతీకి చెందిన 24 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలను నియంత్రించేలా పంచాయతీ ప్రత్యేకాధికారి రామకృష్ణ రోడ్డుకు అడ్డుగా కంచె ఏర్పాటు చేయించారు. ఎర్రగొండ- నీలవరం గ్రామాల మధ్య తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోవడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బంగారుబంద గ్రామానికి చెందిన పాంగి చంప అనే మహిళ గురువారం ఉదయం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు తాడు సాయంతో సింగవరం వాగు దాటించి వై.రామవరం సీహెచ్‌సీకి తరలించారు. అలాగే కాకరపాడు, శింగవరం ఐటీడీఏ కాలనీ సమీప వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది.

చింతపల్లిలో...

చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీ చెరువూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చౌడుపల్లి పంచాయతీ పశువులబంద గ్రామ సమీపంలో ఉన్న చెరువు గట్టుకు గండి పడింది. దీని వల్ల రహదారి పైనుంచి నీరు ప్రవహించడంతో ఈ మార్గంలోనూ రాకపోకలు స్తంభించిపోయాయి. తాజంగి జలాశయం వరద నీటితో కళకళలాడుతున్నది. కుడి, ఎడమ కాలువల నుంచి ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. చింతపల్లి-లంబసింగి జాతీయ రహదారి పెద్దగెడ్డ బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం రెండు భారీ వృక్షాలు రహదారిపై విరిగిపడ్డాయి. స్థానిక తహశీల్దార్‌ త్రివేణి, ఎస్‌ఐ జీ.వీరబాబు స్పందించి యుద్ధప్రాతిపదికన వృక్షశకలాలను తొలగించి గంట వ్యవధిలోనే రాకపోకలను పునరుద్ధరించారు. వర్షం కారణంగా నర్సీపట్నం-చింతపల్లి 33 కేవీ, చింతపలి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 11 కేవీ విద్యుత్‌లైన్లు మరమ్మతులకు గురికావడం, స్తంభాలు విరిగిపడడం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది.

జీకేవీధిలో అత్యధిక వర్షపాతం నమోదు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో జీకేవీధిలో మండలంలో అత్యధికంగా 232.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా పాడేరు మండలంలో 110.8 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు

మండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో..)

జీకేవీధి 232.8

ముంచంగిపుట్టు 171.2

జి.మాడుగుల 158.8

పెదబయలు 150.6

కొయ్యూరు 131.8

అరకులోయ 131.4

చింతపల్లి 128.6

అనంతగిరి 124.2

హుకుంపేట 118.4

డుంబ్రిగుడ 112.6

పాడేరు 110.8

Updated Date - Sep 24 , 2026 | 11:27 PM