ముంచెత్తిన వాన
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:32 AM
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించగా, మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం వాన పడింది. నర్సీపట్నం, చోడవరం, కె.కోటపాడు, గొలుగొండ, పాయకరావుపేట మండలాల్లో కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, సబ్బవరం, రావికమతం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంలో పిడుగుపాటుకు రైతుతో పాటు పాడి గేదె మృతి చెందింది. నర్సీపట్నం మండలం అమలాపురంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు.
పలు మండలాల్లో భారీ వర్షం
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత కుండపోత
- రహదారులు జలమయం
- పిడుగుపాటుకు ఇద్దరి మృతి
అనకాపల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించగా, మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం వాన పడింది. నర్సీపట్నం, చోడవరం, కె.కోటపాడు, గొలుగొండ, పాయకరావుపేట మండలాల్లో కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. అనకాపల్లి, సబ్బవరం, రావికమతం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంలో పిడుగుపాటుకు రైతుతో పాటు పాడి గేదె మృతి చెందింది. నర్సీపట్నం మండలం అమలాపురంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు.
నర్సీపట్నంలో...
నర్సీపట్నం: మునిసిపాలిటీ పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర సేపు కురిసిన వర్షానికి నర్సీపట్నం మెయిన్ రోడ్డు జలమయమైంది. శారదానగర్, వెంకునాయుడుపేట ప్రధాన రహదారి, బొంతువీధికి వెళ్లే రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. బ్యాంక్ కాలనీ, బొంతువీధి, శివపురం, కొత్తవీధిలోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. నర్సీపట్నం- తుని రోడ్డు, పాత మునిసిపల్ కార్యాలయం పక్క రోడ్డులో బురద పేరుకుపోయి ప్రజలు అవస్థలు పడ్డారు.
చోడవరంలో...
చోడవరం: మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. స్థానిక బాలాజీనగర్, కో-ఆపరేటివ్ కాలనీ, పూర్ణాథియేటర్ రోడ్డు, రెల్లికాలనీలను వాననీరు ముంచెత్తింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కాలనీల్లో నీరు నిలిచిపోయింది. పంచాయతీ ఈవో గంగాధర్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది ఎక్స్‌కవేటర్‌తో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నీరు పోయేందుకు మార్గం ఏర్పాటు చేశారు.
కె.కోటపాడులో...
కె.కోటపాడు: మండల కేంద్రం కె.కోటపాడు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.
పిడుగుపాటుకు రైతు, గేదె మృతి
మాకవరపాలెం: మండలంలోని చంద్రయ్యపాలెంలో పిగుడుపడి ఒక రైతుతో పాటు పాడిగేదె మృతి చెందింది. చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన గంగరాజు శుక్రవారం గేదెను మేతకు తీసుకువెళ్లాడు. అయితే మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగుపడి రైతుతో పాటు పాడిగేదె అక్కడికక్కడే చనిపోయింది. రైతు మృతదేహాన్ని గ్రామస్థులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపడి వృద్ధుడి మృతి
నర్సీపట్నం అర్బన్: మండలంలోని అమలాపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో పిడుగుపడి ఒక వృద్ధుడు మృతి చెందాడు. అమలాపురం గ్రామానికి చెందిన షేక్ చిన మదీనా(80) గ్రామ శివారులో పశుగ్రాసం కోసం తమ మేకలను తోలుకు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగు పడడంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.