Share News

కుండపోతగా వాన

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:45 AM

జిల్లాలోని హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. పాడేరు, జి.మాడుగుల, అనంతగిరి, అరకులోయ మండలాల్లో జల్లులు పడ్డాయి. ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానిపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది.

కుండపోతగా వాన
ముంచంగిపుట్టులో జోరున కురుస్తున్న వర్షం

హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి మండలాల్లో భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

పాడేరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. పాడేరు, జి.మాడుగుల, అనంతగిరి, అరకులోయ మండలాల్లో జల్లులు పడ్డాయి. ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానిపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో మధ్యాహ్నం తరువాత వర్షం పడింది. కొన్నిచోట్ల ముసురు వాతావరణం నెలకొని దఫదఫాలుగా జల్లులు పడుతున్నాయి. అయినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. గురువారం కొయ్యూరులో 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరులో 33.1, జీకేవీధిలో 32.9, జి.మాడుగులలో 31.6, చింతపల్లిలో 31.4, అరకులోయలో 31.3, డుంబ్రిగుడలో 29.1, ముంచంగిపుట్టులో 27.9, పెదబయలులో 26.7, హుకుంపేటలో 24.3 డిగ్రీలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో కుండపోతగా..

ముంచంగిపుట్టు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తూనే వుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీపురం, రంగబయలు, బూసిపుట్టు, జోలాపుట్టు, సుజనకోట, దారెల, బంగారుమెట్ట తదితర ప్రాంతాల్లో వాగులు, గెడ్డల్లో వరద నీరు ప్రవహిస్తున్నది. మండల కేంద్రం నుంచి కుమడ వెళ్లే ప్రధాన రహదారి పలుచోట్ల కోతకు గురైంది. మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

పెదబయలులో దంచికొట్టిన వాన

పెదబయలు, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి)ః మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రహదారులపై వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. స్థానిక అంబేడ్కర్‌ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వర్షం నీరు ఇళ్ల ముందు రహదారిపై నిలిచిపోయింది.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం చెందారు. వరినాట్లుకు ఈ వర్షం దోహదపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వర్షం కారణంగా మట్టి, మెటల్‌ రోడ్డు చిత్తడిగా తయారయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో గురువారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయడంతో జనం అల్లాడిపోయారు. మూడు గంంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. గెడ్డలు, వాగుల్లో వరద నీరు ప్రవహించింది.

పిడుగుపడి పశువులు, జీవాలు మృతి

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మొండిగెడ్డ పంచాయతీ కొండపల్లి గ్రామంలో పిడుపాటుకి ఏడు పశువులు, ఐదు గొర్రెలు మృతిచెందాయి. బాధితుల కథనం ప్రకారం కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు పశువులు, గొర్రెలను మేత కోసం గ్రామ శివారులో వున్న కొండపైకి తోలుకెళ్లారు. మధ్యాహ్నం పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్టు కిందవున్న పశువులు, గొర్రెలపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వంతల మోహన్‌, త్రినాథ్‌, గోవింద్‌ల విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:45 AM