ముంచెత్తిన వాన
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:07 AM
ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవగా, శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యథావిధిగా వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. మండలంలోని పీఎస్ పేట, గౌరీపట్నం, అన్నవరం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గౌరీపట్నంలో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
- చోడవరంలో విరిగి పడిన విద్యుత్ స్తంభాలు
- పీఎస్ పేటలో జనుము పూల తోటలకు నష్టం
చోడవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవగా, శనివారం సాయంత్రం నాలుగు గంటలకు యథావిధిగా వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. మండలంలోని పీఎస్ పేట, గౌరీపట్నం, అన్నవరం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గౌరీపట్నంలో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. పీ ఎస్ పేటలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో పట్టణంతో పాటు, రూరల్ ఫీడర్ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం రాత్రంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు తీవ్రంగా శ్రమించిన విద్యుత్ సిబ్బంది చోడవరం టౌన్ వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. శనివారం ఉదయం నుంచి పనిచేసి మిగిలిన గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. స్థానిక పూర్ణా థియేటర్ రోడ్డు, రెల్లికాలనీలను శుక్రవారం రాత్రి వర్షపు నీరు ముంచెత్తడంతో శనివారం ఉదయం పంచాయతీ సిబ్బంది డ్రైనేజీల్లో పూడికలు తీసి వర్షపు నీరు రోడ్లపై లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా భారీ వర్షానికి తోడు వీచిన ఈదురుగాలులకు గౌరీపట్నం, పీఎస్‌పేట, తదితర ప్రాంతాల్లో సరుగుడు తోటలు, అరటి చెట్లు నేలవాలాయి. జనుము తోటలు కూడా గాలులకు వాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవరాపల్లిలో...
దేవరాపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పొలాల్లో నీరు చేరింది.
మాడుగులలో..
మాడుగుల/మాడుగుల రూరల్: మండలంలో శనివారం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఓ మాదిరిగా ఎండకాసింది. ఆ తరువాత వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులతో ఆరంభమై మోస్తరు వర్షం పడింది.
చీడికాడలో..
చీడికాడ: మండలంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఈ వర్షం సరుగుడు, వేరుశనగ పంటలకు, పశుగ్రాసానికి లాభదాయకమే అయినప్పటికీ జీడిమామిడి, మామిడితోటలకు కొంతమేర నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు తెలిపారు.